విజయనగరం రూరల్: మండలంలోని కొండకరకాం రెవెన్యూ సర్వే నంబర్ 198లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గ్రావెల్ క్వారీ తవ్వకాలపై మంగళవారం ప్రజాగ్రహం పెల్లుబికింది. క్వారీ అనుమతు లు పొందిన నిర్వాహకులు మంగళవారం ఉదయం పోలీసుల అండతో చేపట్టిన తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే తిష్టవేసి వంటా వార్పుకు సిద్ధమయ్యారు. దీంతో చేసేది లేక నిర్వాహకులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పోలీసులు మాట్లాడి సాయంత్రం ఐదు గంటల సమయంలో అక్కడ తవ్వకాలను నిలుపుదల చేసి యంత్రాలను, లారీలను తరలించడంతో గ్రామస్తులు శాంతించారు.
ఇష్టారాజ్యంగా అనుమతులు...
మండలంలోని కొండకరకాం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 198లో బొంతుకొండ ఉంది. కొండ దిగువన జెడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామం ఉంది. కొండకు దక్షిణ భాగాన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది. కొండపైన శివాలయం ఉంది. చంద్రబాబు సర్కారు సంపద సృష్టిలో భాగంగా ప్రజారోగ్యాన్ని తాకట్టుపెట్టి, ప్రజాదర్బార్ (గ్రామసభ) నిర్వహించకుండానే రెవెన్యూ శాఖ నివేదికను ఆధారంగా చేసుకుని 2025లో క్వారీ తవ్వకాలకు నంబూరి శిరీషకు 3.55 ఎకరాలు, వెంకట మురుగన్ స్టోన్ క్రషర్ సంస్థ (గోగినేని కృష్ణ చైతన్య)కు 4 హెక్టార్లు కెటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వారీ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్న సమాచారంతో గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తవ్వకాలు జరిపేందుకు క్వారీ వద్దకు పలుమార్లు వచ్చిన నిర్వాహకులను అడ్డుకున్నారు. అయినా, అధికారులు, నిర్వాహకులు వెనక్కి తగ్గకుండా పోలీసు బందోబస్తు మధ్య తవ్వకాలు జరిపేందుకు వస్తూనే ఉన్నారు. క్వారీకి అనుమతి ఇచ్చిన స్థలానికి ఆనుకుని గతంలో పట్టణ పేదలకు 2,500 వరకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా గ్రావెల్ క్వారీ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఏంటని కొండకరకాం గ్రామస్తులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి క్వారీ అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టంచేశారు.
పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో తవ్వకాలకు
సిద్ధమైన నిర్వాహకులు
గ్రామసభ లేకుండానే అనుమతులు ఎలా ఇచ్చారు?
తవ్వకాలను అడ్డుకున్న కొండకరకాం గ్రామస్తులు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు


