విత్తనాల్లో చిలక్కొట్టుడు..! | - | Sakshi
Sakshi News home page

విత్తనాల్లో చిలక్కొట్టుడు..!

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

శృంగవరపుకోట: అధికార బలంతో పచ్చపార్టీ అధినేత నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ఎవరి స్థాయిలో వారు దందా సాగిస్తున్నారు. అధినేత కమీషన్ల రూపంలో రూ.వేలకోట్లు కొల్లగొడుతుండగా.. చోటా నాయకులు, కార్యకర్తలు యూరియా బస్తాలు, విత్తనాల రూపంలో చిలక్కొట్టుడు కార్యక్రమాలకు దిగుతున్నారు. దీనికి ఎస్‌.కోట మండలం పోతనపల్లిలో జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. రైతులకు పంపిణీ చేసేందుకు సోమవారం ఎంటీయూ1121రకం విత్తనాలు 334 బస్తాలు వచ్చాయి. మంగళవారం ఉదయం చూస్తే 280 బస్తాలే ఉండడంతో మిగిలిన 54 బస్తాలు ఎక్కడకు తరలించారంటూ మాజీ సర్పంచ్‌ కె.వెంకటరావుతో పాటు రైతులు ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రి విత్తన బస్తాలు ఎక్కడికి తరలించారంటూ వీఏఏ లావణ్య, జగన్‌లను నిలదీశారు. గతంలో 20 యూరియా బస్తాలు కూడా ఇలాగే పట్టుకుపోయారని, తాము డబ్బుచెల్లించామని, విత్తనాలు ఏమయ్యాయో తెలియడం లేదంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారు. రైతులు గట్టిగా నిలదీయడంతో వేరొక గదిలో టీడీపీ నాయకుడు దాచిన 20 బస్తాలను తెచ్చారు. మిగిలిన 34 బస్తాల లెక్క ఏంటి అంటూ గ్రామస్తులు నిలదీయడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీతారాంపురం గ్రామం నుంచి ఆటోలో 20 విత్తన బస్తాలను రప్పించారు. విత్తన బస్తాలను వేరొక గదిలో ఉన్న 20 బస్తాలపై ఉంచి తాళం వేయడంతో మాజీ సర్పంచ్‌ వెంకటరావు మరొక తాళం వేశారు. మిగిలిన 14 విత్తన బస్తాల లెక్క తేల్చాలంటూ నిలదీశారు. ఇదే విషయమై ఏఓ కె.రవీంద్రను వివరణ కోరగా గ్రామంలో విత్తన పంపిణీ జరిగిందని, ఇరువర్గాలు మనస్పర్థల వల్ల కొంత ఇబ్బంది వచ్చిందని, గ్రామంలోకి వెళ్లి సమస్యలేకుండా చూస్తానని చెప్పారు.

54 బస్తాలు మాయం

రైతుల ఆందోళనతో దిగొచ్చిన నాయకులు

వెనక్కి తెప్పించిన 40 బస్తాలు

14 బస్తాలకు పద్దు లేదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement