మర్యాదపూర్వక కలయిక | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక కలయిక

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

విజయనగరం: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వలిరెడ్డి శ్రీనివాసనాయుడు జగన్‌మోహన్‌రెడ్డికి దుశ్శాలువతో సత్కరించి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అందజేశారు.

స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి

విజయనగరం గంటస్తంభం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని విజయనగరం జిల్లా ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ డిమాండ్‌ చేసింది. జూలై 3న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

పింఛన్‌ డబ్బుల్లో కోత..

కొత్తవలస: ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఇంటి తలుపు తట్టి మరీ పింఛన్‌ ఇస్తాం అంటూ చెప్పుకొస్తున్న కూటమి ప్రభుత్వం పంపిణీలో చేతులెత్తేస్తోంది. కొత్తవలస మండలంలోని 21 గ్రామసచివాలయాలు ఉండగా, 3 సచివాలయాలకు అందజేయాల్సిన పింఛన్‌ సొమ్ములో కోత విధించింది. దేశపాత్రునిపాలెం సచివాయం పరిధిలో రూ.లక్షా24వేల750లు, చింతలపాలెం సచివాలయానికి రూ.5,843, దేవాడకు 8,700 తక్కువగా చెల్లించింది. లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేట సచివాలయానికి రూ. 8వేలు, లచ్చింపేట, ఖాసాపేట సచివాలయాలకు రూ.4వేలు చొప్పున, లక్కవరపుకోట సచివాలయానికి రూ.34,500 చొప్పున కోతపెట్టింది. దీంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

జిందాల్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

రైతులతో సమావేశంలో హోం మంత్రి అనిత వెల్లడి

మద్దిలపాలెం: జిందాల్‌ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెతో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే లలిత కుమారి, ఎమ్మెల్సీ రఘురాజు, జిందాల్‌ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ భేటీలో నిర్వాసితులకు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పరిహారం అందని 82 మంది రైతులకు షేర్‌ అమౌంట్‌ పంపిణీ చేయడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించనున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి బంధవలసలో మూడు సెంట్ల ఇళ్ల స్థలం, భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు అదనంగా రూ.2.5 లక్షల ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే చీడిపాలెంలో ఐదుగురికి పరిహారం, 18 మంది రైతుల పీవోటీ అంశాల పునఃపరిశీలన, మూలబుడ్డవరంలో అర్హులకు డీ–పట్టాల మంజూరుకు ఆమోదం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement