విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని జూలై 4వ తేదీన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వాల్‌పోస్టర్లను మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీ లక్ష్మీపతిరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తుల గురించి వారి పోరాట పటిమ గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అటువంటి మహనీయుల జీవిత విశేషాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు స్ఫూర్తిని పొందుతారన్నారు. కోటలో ఉన్న స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సమైఖ్య భారతి సమన్వయకర్త పి.కన్నయ్య, ఆర్యవైశ్యసంఘం కంటోన్మెంట్ శాఖ అధ్యక్షుడు డిమ్స్ రాజు, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవి, ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ జిల్లాశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


