పూసపాటిరేగ: మండలంలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని మధురవాడకు చెందిన బాడితమాని ఉమామహేశ్వర్రావు శ్రీకాకుళంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి మంగళవారం మధ్యాహ్నం కారులో వెళ్లి తిరుగుప్రయాణంలో వస్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉమామహేశ్వర్రావుకు భార్య మాధురి ఉంది. ఓ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలో ఉమామహేశ్వర్రావు పని చేస్తున్నాడు. కారు ముందుభాగం లారీలో ఇరుక్కోవడంతో కారు నుంచి మృతదేహాన్ని అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.


