సేవలో సరిలేరు మీకెవ్వరు.! | - | Sakshi
Sakshi News home page

సేవలో సరిలేరు మీకెవ్వరు.!

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

ప్రాణం నిలిపే దేవుడు వైద్యుడు

వృత్తిలో దైవసమానులు

నేడు వైద్యుల దినోత్సవం

గౌరవప్రదమైన వృత్తి

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైంది. వృత్తిలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవడంతో పాటు సేవాభావం, గౌరవప్రదంగా మెలగాలి. వైద్యుడు వారి వద్దకు వచ్చే రోగికి ఇచ్చే మానసిక ధైర్యం ఎంతో కీలకం. డాక్టర్లపై ఒత్తిడి లేనప్పుడు మరింత మెరుగైన సేవలు అందిస్తారు. సమాజంలో ఎంతో గౌరవమైన ఈ వృత్తిలో ప్రతి రోగిని ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దగలితేనే వృత్తిపరమైన సంతప్తి ఉంటుంది. దానికి వెలకట్టలేం. ఈ వృత్తిని ఎంతో ఇష్టం, ప్రేమతో చేస్తున్నాం. – వి.శివశంకర్‌, వైద్యుడు,

ఎంఎస్‌ పురం, పాలకొండ మండలం

సేవ చేయాలనే తపన

చిన్నప్పటి నుంచి వైద్య వత్తి అంటే ఎంతో మక్కువ. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్యవృత్తిని స్వీకరించాను. కష్టమైన స్థితిలో కూడా చలించిపోకుండా రోగి ప్రాణాలు కాపాడడంలో వైద్యులు ఎంతో తపన చెందాల్సి ఉంటుంది. రోగికి ప్రాణాపాయం తప్పినప్పుడు వారి కళ్లల్లో కనిపించే కతజ్ఞతాభావం వృత్తిపరమైన సంతప్తిని ఇస్తుంది. ఓపిక, సహనం ఉంటేనే వైద్యుడిగా గుర్తింపు లభిస్తుంది.

– కడియం చిరంజీవి సూపరింటెండెంట్‌, ఏరియా ఆస్పత్రి, పాలకొండ

పాలకొండ రూరల్‌: కనిపించని దేవుడి కన్నా మనిషికి సుస్తీ చేసినప్పుడు ప్రాణాలను నిలబెట్టే ప్రత్యక్ష దైవం వైద్యుడు. అందుకే ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నవారు, వారి బంధువులు వైద్యుడిని భగవంతుడిలా చూస్తారు. అహర్నిశలు కష్టించి సూక్ష్మదృష్టితో, ఆప్యాయమైన పలకరింపుతో రోగిలో మానసిక ధైర్యాన్ని నింపే వైద్యుడికి సమాజంలో ఏ మూలకు వెళ్లినా ఎంతో ప్రాధాన్యతతో కూడిన విశిష్ట స్థానముంటుంది. ఎటువంటి విపత్కర స్థితిలోనైనా క్షతగాత్రులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది. గతంలో ముట్టుకుంటే ప్రాణాలను హరించే కోవిడ్‌ సమయంలో వైద్యులు తమ వృత్తిని దైవంగా భావించి ఎందరో ప్రాణాలను కాపాడారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. శారీరక సంకట స్థితిలో ఎంతటి గొప్ప వారికై నా ఆ భగవంతుడి సాక్షాత్కారమే వైద్యుడని చెప్పక తప్పదు. శాంతికి చిహ్నమైన తెలుపురంగు వస్త్రాలతో ఆత్మీయ పలకరింపుతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు స్వాంతన చేకూర్చడంలో వైద్యులు అహర్నిశలు కష్టిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు వత్తిరీత్యా చేస్తున్న తప్పులను పక్కనపెడితే సమాజంలో వైద్యుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.

వైద్య వృత్తికి మూలాలు

మానవ జీవన పరిణామక్రమంతో పాటు ప్రస్తుత యాంత్రిక యుగంలో అధునాతన, వైజ్ఞానిక, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీంతో వైద్యవృత్తిలో, సేవల్లో పోటీ తత్వం నెలకొంది. ప్రపంచ వైద్య శాస్త్ర మూలాలు భారతదేశ సంస్కృతిలోనే దాగి ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆంగ్ల వైద్యంతో పాటు అలనాడు మన పూర్వీకులు రచించిన ఆయుర్వేద వైద్యవిధానం ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉంది. చరకుడు, శుశ్రూతుడు, ధన్వంతరి వంటి ఎందరో అపార మేధోవిజ్ఞాన సంపత్తి కలిగిన వైద్యులు భరతమాత బిడ్డలే. భారతదేశంలో తొలి శస్త్ర చికిత్స నిపుణుడిగా గుప్తుల కాలంనాటి శుశ్రూతుడ్ని ఇప్పటికీ చరిత్రకారులు ఉటంకిస్తున్నారు. కనిష్కుని ఆస్థానంలో వైద్యుడిగా పనిచేసిన చరకుడు ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడు. ఆయన రాసిన చరక సంహిత నేటికీ ఆయుర్వేద వైద్య విద్యకు మూలగ్రంథంగా పేర్కొంటారు. జిల్లాలో ప్రధాన వైద్య కేంద్రంతో పాటు మూడు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు మూడుతో పాటు 37 ప్రాథమిక వైద్య కేంద్రాలు, మరో వందవరకూ ప్రైవేట్‌ వైద్యశాలలు ఉన్నాయి. వాటిద్వారా దాదాపు 550మంది పై చిలుకు వైద్యులు జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement