● 13 రోజుల తరువాత వెలుగులోకి ప్రమాదం
● బైక్ నంబర్ ఆధారంగా కుటుంబ
సభ్యులను గుర్తించిన పోలీసులు
గరుగుబిల్లి: ఒడిశా రాష్ట్రంలోని రాయగడకు చెందిన పారసిల్లి నర్సింగరావు(24)రహదారి ప్రమాదంలో ఈనెల 17న మృతి చెందిన ఘటన 13రోజుల తరువాత మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ఎస్సై షేక్ ఫకృద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 17న తోటపల్లి దేవస్థానం నుంచి ఖడ్గవలస వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నర్సింగరావు కుదమ మట్టి రోడ్డు సమీపంలో మలుపువద్ద అతివేగం కారణంగా బైక్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింగరావుకు వెంటనే వైద్య సహాయం అందకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం పొదల్లో ఉండడంతో ఈ ఘటన ఎవరి దృష్టికి రాలేదు. మంగళవారం ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లడంతో స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించిన పోలీసులు రాయగడలోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రేపటివలస తోటల్లో
ఏనుగుల గుంపు
సీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా రెండు వారాలుగా మామిడి తోటల్లో సంచరిస్తున్న 8 ఏనుగుల గుంపు మంగళవారం తెల్ల వారు జామునుంచి తామరఖండి పంచాయతీ రేపటివలస పనస, మామిడితోటల్లో సంచరిస్తున్నాయి. నేటికి రెండువారాలుగా సీతా నగరం మండలంలో గజరాజులు రోజుకో తోటను ఎంపిక చేసుకుని సంచరిస్తున్నాయి. ఈ మేరకు గజ రాజుల కదలికలను గుర్తించి పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అటవీఖాఖ బీట్ అధికారి సత్యనారాయణ తెలియజేశారు.
60 మంది ఎంఎస్పీలు పోలీస్ శాఖకు అటాచ్
విజయనగరం క్రైమ్: గత ప్రభుత్వ హయాంలో నియమించిన మహిళా సంరక్షణ పోలీసులు జిల్లాలో ఉన్న 60 మంది ఈ నెల 3 వ తేదీన ఎస్పీ ముందు హాజరు కావాలంటూ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్, మున్సిపల్, సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎన్యూమరేషన్, సెన్సెస్ లాంటి పనులకు సిబ్బంది తక్కువగా ఉన్నారన్న సమాచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. వాస్తవానికి ఎంఎస్పీలకు జాబ్చార్ట్ రూపకల్పన ఇంతవరకు చంద్రబాబు సర్కార్ చేయలేదు సరికదా..కొంత మంది మమ్మల్ని పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేయాలని కోర్టుకు వెళ్లారు. ఆ విషయంపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది సిబ్బందిని ఉన్న పళంగా హోం శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జిల్లాలో పని చేస్తున్న ఎంఎస్పీలతో ఈ నెల 3 వ తేదీన ఎస్పీ సమావేశం నిర్వహించాలని హోం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడడం విశేషం.


