రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో గడ్డి మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోట వెంకట్రావు (40)కు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. మూడు రోజుల నుంచి విపరీతంగా మద్యం తాగుతూ భార్యాపిల్లలను పట్టించుకోకపోవడంతో భార్య పార్వతి మందలించింది. దీంతో 29వ తేదీ మధ్యాహ్నం పొలంపనికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి పొలంలొకి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత భార్య కూడా పొలానికి వెళ్లింది.అప్పటికే పురుగు మందు తాగిన వెంకట్రావు వాంతులు చేసుకుంటున్నాడు. అలాగే నోటి ద్వారా నురగలు వస్తున్నాయి. ఏమైందని భార్య అడగగా గడ్డి మందు తాగానని చెప్పాడు. వెంటనే భార్య పార్వతి, మరిదితో కలిసి ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు హెచ్‌సీ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య?
సాలూరు రూరల్: మండలంలోని తోణాం గ్రామానికి చెందిన మహిళ మామిడి హయిజమ్మ (40) మంగళవారం తెల్లవారు జామున ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శ్లాబ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని రూరల్ ఎస్సై రవీంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆమె పెళ్లి అయి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం ఆమె సోమవారం సాలూరు పట్టణానికి వెళ్లి వచ్చిన తరువాత 9 గంటల వరకు వారితో కలిసి ఉంది. తెల్లవారు జామున చూసేసరికి తాడుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


