కొత్తవలస: మండలంలోని కొతవలస–హౌరా రైల్వే లైన్‌లో కంటకాపల్లి–అలమండ రైల్వే స్టేషన్‌ల మధ్య విద్యుత్ స్తంభాల వద్ద సుమారు 55 సంత్సరాల వయస్సుగల వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఈ మేరకు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ వి.అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రైలు నుంచి జారిపడినట్లు ఉందన్నారు. కుడికాలు తొడ వరకు తెగిపడి ఉన్నట్లు చెప్పారు. మృతుడి పక్కన తెలుపు, నలుపు, నీలం రంగుల గల పువ్వుల చొక్కా, కాఫీ కలర్ చొక్కాలు పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి మృతేదేహాన్ని విజయనగరం తరలించినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742,6301365605 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
సాలూరు: గడిచిన మూడు నెలలుగా సాలూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ రోడ్లపై తిరుగుతున్న గుర్తు తెలియని మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాంధీనగర్ జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఆ మహిళను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమై ప్రమాదస్థలంలోనే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని చనిపోయిన మహిళ వివరాలు ఎవరికై నా తెలిస్తే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


