ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ‘టెట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ‘టెట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఎమ్మెల్సీ డాక్టర్‌ గాదె వినతి

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) అమలులోకి రాకముందు నియామకమైన ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ‘టెట్‌’ నిబంధన నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు డాక్టర్‌ గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని భోగాపురం వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీఈ యాక్ట్‌ 2009 అమలు కాకముందు నుంచే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం తక్షణమే చట్ట సవరణ చేయాలని ఎమ్మెల్సీ కోరారు. ఎన్నో ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి కేంద్ర విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే 2010వ సంవత్సరానికి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిబంధన నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని భోగాపురం వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇజ్జురోతు రామునాయుడు, జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి బల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement