పన్ను కట్టక తప్పదిక..! | - | Sakshi
Sakshi News home page

పన్ను కట్టక తప్పదిక..!

Jun 30 2026 12:25 AM | Updated on Jun 30 2026 12:25 AM

పన్ను కట్టక తప్పదిక..!

ఇకపై ఏఎంసీల్లో ఈ పర్మిట్‌

జూలై ఒకటి నుంచి అమల్లోకి

సిబ్బంది అక్రమ వసూళ్లకు చెక్‌

విజయనగరం ఫోర్ట్‌: వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో మాన్యువల్‌ పర్మిట్‌ విధానానికి మార్కెటింగ్‌శాఖ స్వస్తి పలికింది. దాని స్థానంలో ఈ – ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ విధానాన్ని తీసుకొచ్చింది. జూలై ఒకటో తేదీ నుంచి దీన్ని జిల్లాలో అమలు చేయనున్నారు. జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్‌ కమిటీల పరిధిలో ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మార్కెటింగ్‌శాఖ సిబ్బంది చేతితో రాసిన పర్మిట్‌ పేపర్‌ను ఇచ్చేవారు. దీని వల్ల నకిలీ పర్మిట్‌లు కూడా కొంతమంది సృష్టించేవారు. అంతేకాకుండా పర్మిట్‌ లేకుండా కూడా కొంతమంది సిబ్బందితో కలిసి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నూతనంగా తీసుకొచ్చిన ఈ–ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ విధానంలో అటువంటి వాటికి ఆస్కారం ఉండదు.

వ్యాపారులు ఆన్‌లైన్‌లో ఈ–పర్మిట్‌ తీసుకోవాలి

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే ప్రతి వ్యాపారి ఆన్‌లైన్‌ ద్వారా పర్మిట్‌ పొందాల్సి ఉంటుంది. మార్కెట్‌ ఫీజు డిజిటల్‌ పద్ధతిలో చెల్లించిన వెంటనే ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌తో కూడా ఈ–ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ జారీ అవుతుంది. ఈ ఽవిధానం వల్ల గతంలో లాగా రైతులు, వ్యాపారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. వ్యవసాయ చెక్‌ పోస్టుల వద్ద ఈ–పర్మిట్‌ పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే పర్మిట్‌ ధ్రువీకరణ జరుగుతుంది. దీని వల్ల రైతుల ఉత్పత్తులు మార్కెట్లకు చేరే పక్రియ సులభతరమవుతుంది.

సిబ్బంది అక్రమాలకు చెక్‌

వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమయంలో చెక్‌ పోస్టుల వద్ద సిబ్బంది అక్రమాలకు పాల్పడేవారనే ఆరోపణలు ఉన్నాయి. చెక్‌పోస్టు సిబ్బందికి కొంతముట్టజెప్పడం ద్వారా అక్రమంగా సరుకు రవాణా అయ్యేదనే విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు పర్మిట్‌ లేకుండా అక్రమంగా రవాణా చేయడం వల్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు రావాల్సిన ఆదాయానికి కూడ గండి పడేది. ఈ– పర్మిట్‌ విధానం వల్ల సిబ్బంది చేతివాటానికి పూర్తి స్థాయిలో చెక్‌ పడే అవకాశం ఉంది.

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు 8 ఉన్నాయి. వ్యవసాయ చెక్‌ పోస్టులు 12 ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ, మెరకముడిదాం, రాజాంలలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న, పెసర, మినుము ఉత్పత్తులు రవాణా చేస్తారు.

357 మంది వ్యాపారులు

జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే లైసెన్స్‌ కలిగిన వ్యాపారులు 357 మంది ఉన్నారు. వారంతా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమపేర్లు నమోదు చేసుకుని ఈ– ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ను పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆన్‌లైన్‌ పర్మిట్‌ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి రవాణాను పూర్తిగా నిషేధించనున్నారు. బ్యాంకుల ద్వారా పన్ను చెల్లించడానికి 15 రోజులు సమయం ఉంటుంది. ఈ లోపు డబ్బులు చెల్లించకపోతే ఆన్‌లైన్‌ పక్రియ నిలిచిపోతుంది. చెక్‌ పోస్టుల వద్ద ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా పంట దిగుబడులను తరలించే వారిని నాన్‌ ట్రేడర్స్‌ కింద పరిగణించి పన్ను వసూలు చేస్తారు. అయితే లైసెన్స్‌ లేకుండా రవాణా చేయడానికి మూడు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈలోగా సదరు వ్యాపారి లైసెన్స్‌ చేయించుకోవాలి. మూడు సార్లు దాటిన తర్వాత లైసెన్స్‌ లేకుండా రవాణా చేస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు.

మార్కెట్‌ ఫీజు ఎగవేత కుదరదు:

ఈ–ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ వల్ల మార్కెట్‌ ఫీజు (పన్ను) ఎగవేయడానికి కుదరదు. ఆన్‌లైన్‌ చేయడం వల్ల చెక్‌ పోస్టుల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన పని ఉండదు. జూలై ఒకటో తే దినుంచి ఈపర్మిట్‌ విధానం అమల్లో రానుంది.

బి.రవికిరణ్‌, మార్కెటింగ్‌శాఖ ఎ.డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement