చీపురుపల్లి: ఎన్నో సిద్ధాంతాలతో వ్యవస్థలను మార్చేందుకే జనసేన పుట్టిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెబుతుండగా... నామినేటెడ్ పదవి కోసం రూ.లక్షల్లో వసూలు చేశారంటూ పార్టీ సొంత క్యాడర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి వరకు అందరూ ప్యాకేజీ స్టార్‌లేనన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నామినేటెడ్ పోస్టులను డబ్బులకు అమ్మేస్తున్న అంశం జిల్లాలో దుమారం రేపుతోంది. జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాకపోయినప్పటికీ ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా పదవి కోసం డబ్బులు ఇచ్చుకోవాల్సి రావడంతో పార్టీ క్యాడర్‌లో నైరాశ్యం అలముకుంది. తీగలాగితే డొంక కదిలినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం డబ్బులు కాజేశారని పార్టీ జిల్లా ప్రచార కో ఆర్డినేటర్ కోట్ల కష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తరుణంలో అదే పోస్టుకు మరో ఇద్దరి నుంచి కూడా డబ్బు లావాదేవీలు జరిగినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది.
ప్యాకేజీయే ప్రధానం...
జనసేన పార్టీలో నామినేటెడ్ పదవి కోసం డబ్బులిచ్చి మోసపోయిన జాబితాలో చీపురుపల్లికి చెందిన కోట్ల కష్ణతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు సమాచారం. విజయనగరానికి చెందిన ఓ బాబు ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చాడని, మెరకముడిదాం మండలానికి చెందిన ఓ వీర మహిళ రూ.6 లక్షలు ముట్టజెప్పినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అక్కడ అధినేత, ఇక్కడ నాయకులు కిందిస్థాయి కార్యకర్తలు, చోటా నాయకులను ప్యాకేజీలతో మోసంచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విషయం వెలుగు చూడడంతో...
తనకు పదవి ఎలాగూ ఇప్పించలేకపోయారు.. తను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని ఐదారు నెలలుగా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందనలేదు. అందుకే ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశాను. స్పందన లేకపోవడంతో మళ్లీ 28న చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు మీడియాకు కృష్ణతెలిపాడు. అదే సమయంలో ఫిర్యాదు ఇవ్వొద్దని, డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయని, తన బ్యాంకు ఖాతాకు తీసుకున్న డబ్బుల నుంచి రూ.1.5 లక్షలు జమచేసినట్టు వెల్లడించాడు. మేరకముడిదాం మండలానికి చెందిన వీర మహిళకు కొద్ది రోజుల కిందటే రూ.6 లక్షలు సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. అయితే, తను ఎవ్వరి వద్ద పదవుల పేరిట డబ్బులు తీసుకోలేదంటూ తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. కావాలనే టార్గెట్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇదే అంశంపై బాధితుడు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ డబ్బులు తీసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని ఫోన్లు ఎందుకు చేస్తున్నారని, రూ.1.5 లక్షలు ఎందుకు తిరిగి ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లా నాయకులు అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతే ఫిర్యాదుచేశానన్నారు. పార్టీ అధిస్థానం మద్దతు ఉందని, అన్యాయం జరిగితే ప్రశ్నించమని పార్టీ అధినేత చెప్పారన్నారు.
జనసేనలో పదవుల పేరిట డబ్బుల కలెక్షన్!
ఒకే పదవిని ముగ్గురికి ఆశ
చూపి డబ్బులు దందా
ఒకరి నుంచి బ్లాంక్ చెక్, మరొకరి
నుంచి రూ.12 లక్షలు, ఇంకొకరి నుంచి రూ.6 లక్షలు వసూలు
రచ్చకెక్కుతోందని తెలిసి వీర మహిళకు రూ.6 లక్షలు సెటిల్మెంట్
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కోట్ల కష్ణ ఖాతాలో రూ.1.5 లక్షలు జమ
తానెవ్వరి దగ్గర డబ్బులు
తీసుకోలేదంటున్న యశస్విని
డబ్బుతీసుకోకపోతే రూ.1.5లక్షలు
ఎందుకిచ్చారంటూ ప్రశ్నించిన కోట్ల కష్ణ


