ఆలస్యం చేస్తే సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

ఆలస్యం చేస్తే సహించేది లేదు

Jun 30 2026 12:25 AM | Updated on Jun 30 2026 12:25 AM

ఆలస్యం చేస్తే సహించేది లేదు

విజయనగరం అర్బన్‌: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా ఆలస్యం వహిస్తే సహించేది లేదని జేసీ సేతు మాధవన్‌ అధికారులను హెచ్చరించారు. అలాగే వినతుల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని, పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించి డిస్పోజ్‌ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)’ ‘రెవెన్యూ క్లినిక్‌’ కార్యక్రమాలకు జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు మొత్తం 197 వినతులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 103 వినతులు ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. శాఖల వారీగా వచ్చిన వినతులను పరిశీలిస్తే రెవెన్యూ శాఖకు 103, డిఆర్‌డీఏకు 24, ఇతర శాఖలు 21, పంచాయితీ రాజ్‌కు 14, విద్యాశాఖకు 12, విద్యుత్‌ శాఖకు 7, మున్సిపాలిటీ కి 7, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు, గ్రామ సచివాలయ శాఖకు చెరో 4 వినతులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాదవన్‌ మాట్లాడుతూ ముఖ్యంగా భూమి, సర్వే వంటి రెనెన్యూ సమస్యలపై సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమ శాఖకు వచ్చిన వినతులను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

పీజీఆర్‌ఎస్‌పై డిజిటల్‌ పర్యవేక్షణ

1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చే కాల్స్‌ పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జేసీ అన్నారు. సంబంధిత అధికారులు అర్జీదారుని స్వయంగా కలిసి, మాట్లాడిన తర్వాతే ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ సమయాన్ని కూడా తమ రిపోర్ట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రజలకు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌పై మరింత అవగాహన కల్పించాలని ఈ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులకు సైతం అధికారులు సరైన రీతిలో సమాధానం ఇస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సీహెచ్‌.సత్తిబాబు, పీజీఆర్‌ఎస్‌ జిల్లా నోడల్‌ అధికారి ఈ.మురళి, జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు, ఆర్‌డీఓలు, జిల్లా సర్వే శాఖ సహాయ సంచాలకులు ఆర్‌.విజయకుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదు దారులకు చట్టపరిధిలో న్యాయం

విజయనగరం క్రైమ్‌: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అర్జీలతో వచ్చిన ప్రతి ఫిర్యాదు దారుని ఆవేదనను సిబ్బంది అర్థం చేసుకోవాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన చాంబర్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో భాగంగా అర్జీలను స్వీకరించారు. ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 37 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో భూతగాదాలు18, కుటుంబ కలహాలు1, చీటింగ్‌ 7, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వాటి వివరాలను స్టేట్‌మెంట్‌ రూపంలో డీపీఓకు పంపాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపుఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి సిబ్బంది పాల్గొన్నారు.

జేసీ సేతు మాధవన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement