మడ్డువలసకు ఇన్‌ఫ్లో నిల్‌ | - | Sakshi
Sakshi News home page

మడ్డువలసకు ఇన్‌ఫ్లో నిల్‌

Jun 30 2026 12:25 AM | Updated on Jun 30 2026 12:25 AM

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ప్రాజెక్టులోకి చుక్కనీరు రాకపోవడంతో నీటిమట్టం డెడ్‌ లెవెల్‌ స్థాయికి చేరింది. ప్రాజెక్టు వద్ద సోమవారం 62.39 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 65 మీటర్లు కాగా, 3.37 టీఎంసీల నీరు నిల్వకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1.30 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఖరీఫ్‌ సీజన్‌కు కుడి, ఎడమ కాలువల ఆయకట్టు పరిధిలో 31 వేల ఎకరాలకు సాగునీరందించాలంటే వర్షాలు కురిసేవరకు వేచి ఉండాల్సిందేనని ప్రాజెక్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆరుగురు ఉద్యోగులపై వేటు

విజయనగరం అర్బన్‌: ఎన్నికల విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించి, ఉద్దేశపూర్వకంగా విధులను విస్మరించినట్లు తేలడంతో జిల్లాకు చెందిన ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులలో భారత కర్నాయిన్‌ (వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి, లచ్చయ్యపేట సచివాలయం, రాజాం మండలం), సవిరిగాన శివకృష్ణ (పంచాయతీ క్యాదర్శి హొంజరాం గ్రామం, సంతకవిటి మండలం), పి.విజయ (మహిళా సంరక్షణ కార్యదర్శి, చుక్కవలస, గరవిడి మండలం), వీఎస్‌ఎస్‌ప్రకాశ్‌రావు (పంచాయతీ కార్యదర్శి దబ్బిరాజుపేట గ్రామం, వేపాడ మండలం), కె.గంగాధర్‌ (పంచాయతీ కార్యదర్శి, చిన్నగుడిపాల, వేపాడ మండలం), కేజీఎల్‌మాధురి (ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, జడ్డేటివలస, జామి మండలం) ఉన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనలకు లోబడి, అత్యంత బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిష్పాక్షికంగా సాగాలన్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

1న డీఈఈసెట్‌–2026 ప్రవేశ పరీక్షలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలో డీఈఈసెట్‌ ప్రవేశ పరీక్షలను జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాజులరేగలో గల సీతం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తున్నట్లు డీఈఓ పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షకు హాజరేయ్యేటపుపడు తప్పనిసరిగా తమ హాల్‌ టికెట్‌, చెల్లుబాటయ్యే ఏదైనా ఒక ఫొటో గుర్తింపుకార్డు వెంట తీసుకురావాలి. పరీక్షా కేంద్రంలో అమలులో ఉన్న నిబంధనలు, సూచనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర నిషేధిత వస్తువులను పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థులందరూ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా పరీక్షను విజయవంతంగా రాసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సూచించారు. పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి వివరాల కోసం డైట్‌ ఇన్చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డి.అప్పలనాయుడు ఫోన్‌ 9440338045 నంబర్‌ను సంప్రదించవ్చని తెలియజేశారు.

గంజాయి కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు

విజయనగరం క్రైమ్‌: విజయనగరం వన్‌ టౌన్‌ పీఎస్‌లో 2023లో నమోదైన గంజాయి కేసులో నగరానికి చెందిన ముద్దాయి బొంతు వెంకటేశ్వరరావు (38)కు మూడేళ్లు జైలు శిక్ష రూ.30 వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్‌ క్లాస్‌ ఏడీజే, ఎన్డీపీఎస్‌ స్పెషల్‌ జడ్జి కె.విజయ కల్యాణి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన బొంతు వెంకటేశ్వర రావు ప్రస్తుతం నగరంలోని గోకపేటలో నివాసం ఉంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 5 కిలోల గంజాయి కొనుగోలు చేసి, చిన్న పొట్లాలుగా చేసి, 2023లో ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ వద్ద విక్రయించేందుకు సిద్ధపడుతుండగా విజయనగరం వన్‌ టౌన్‌ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో జడ్జి ముద్దాయికి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో 6 మాసాలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నట్లుగా ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement