● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత
● ఆహార పదార్థాలను రుచిచూసి
పరీక్షించిన కలెక్టర్
విజయనగరం లీగల్: జైలు సిబ్బంది కానీ, తోటి ఖైదీలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైదీల పట్ల వివక్ష చూపకూడదని, ఇటువంటి చర్యలకు పాల్పడితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత హెచ్చరించారు. ఈ మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమవారం ఏర్పాటు చేసిన ’బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనర్స్’లో భాగంగా, విజయనగరం సబ్ జైలులో సమీక్షా సమావేశంతో పాటు తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలులో నిర్వహిస్తున్న ’లీగల్ ఎయిడ్ క్లినిక్’ పనితీరును, పారా లీగల్ వలంటీర్లు, న్యాయవాదుల సేవలను పర్యవేక్షించారు. ఖైదీలకు సకాలంలో న్యాయ సహాయం అందించేందుకు ఈ క్లినిక్‌లను ఏర్పాటు చేశామని, వాటిని సక్రమంగా కొనసాగించాలని సూచించారు. రిమాండ్‌లో ఉన్న ఏ ఒక్క నిందితుడు న్యాయవాది లేకుండా ఉండకూడదని, అట్టి వారికి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని అందిస్తామని స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్‌లను పరిశీలించి, ఆహార పదార్థాలు, పప్పు దినుసులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఖైదీలకు ఇస్తున్న ఆహారాన్ని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి స్వయంగా రుచి చూసి పరీక్షించారు. కార్యక్రమంలో జేడీఏ వి.టి.రామారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవన రాణి, విజయనగరం డీఎస్పీ రాఘవులు, ఆర్‌డీఓ సుధాసాగర్, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణ, పరిశ్రమలశాఖ జీఎం కరుణాకర్, జిల్లా ఉపాధి అధికారి రవీంద్రకుమార్ తదితర కమిటీ సభ్యులు, జైలు సూపరింటెండెంట్, ఇతర పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


