● అధికారులను కోరిన మృతుడి కుమారుడు
పార్వతీపురం రూరల్: సాలూరు మండలం బొర్ర పనుకువలసకు చెందిన చిక్కుడు సరుబు(66) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని, పోస్టుమార్టం నివేదికలో జాప్యం లేకుండా చూడాలని మృతుడి కుమారుడు చిరంజీవి అధికారులను కోరాడు. వైద్యం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో సరుబు మృతి చెందడం, ఆయన మృతదేహం పసుపువానివలస సమీపంలోని సువర్ణముఖి నది ఒడ్డున దొరకడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహంపై ముఖం నల్లబడడం, నోరు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం వంటి గాయాలు స్పష్టంగా ఉండడంతో, ఇది ముమ్మాటికీ అనుమానాస్పద మృతేనని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా..దర్యాప్తు ప్రక్రియలో ఆశించిన వేగం లేదని, పోస్టుమార్టం నివేదిక రాకలో జరుగుతున్న ఆలస్యంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి తాము వేచి చూస్తున్నామని, అధికారుల నుంచి సరైన స్పందన కరువైందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తండ్రి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలికితీయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో విన్నవించాడు. త్వరితగతిన పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి, నివేదికను అందజేయాలని విజ్ఞప్తి చేశాడు.


