పార్వతీపురం రూరల్: మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పట్టణ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని.. చెత్త సేకరణ, కాలువల్లో పూడికతీత పనుల్లో ఎటువంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


