రాజాం: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వందవ జాతరను ఆసరగా తీసుకున్న పోలీస్‌బాస్ వసూళ్లపై విచారణ ప్రారంభమైంది. దేవదాయశాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా జాత రకు వచ్చిన చందాలు, బలవంతపు వసూళ్లపై వివరాలు సేకరణ ప్రారంభించారు. రాజాం పట్టణ సర్కిల్ పోలీస్ అధికారి దందాపై ఈనెల 11న ‘అశోకవనంలో భక్షక భటుడు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి దేవదాయశాఖ అధికారులు స్పందించారు. ఆ శాఖ డీసీ శిరీష బుధవారం రాజాం పైడితల్లి ఆలయ ఈఓ బీవీ మాధవరావును విజయనగరం కార్యాలయానికి పిలిపించారు. అక్కడ సాక్షిలో కథనానికి సంబంధించిన వివరాలపై సమీక్షించారు. దేవదాయశాఖను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు నిమిత్తం పట్టణ పోలీస్ అధికారి నగదును ఇమ్మన్న విషయం వాస్తవమేనని ఈఓ తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై డీసీ స్పందించి పోలీసులకు ఎటువంటి నగదు ఇవ్వవద్దని ఆదేశించారని తెలిసింది. ఈ ఏడాది ఇస్తే ఏటా ఇలానే ఇవ్వాలని అన్నారని, అంతే కాకుండా ఈ ఏడాది యాత్రకు టికెట్లు, హుండీలు ద్వారా వచ్చిన ఆదాయమే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆడంబరాలకు స్పాన్సర్లు నుంచి వచ్చిన ఆదాయం వివరాలు, జాతర పేరుతో ఇతర శాఖలు చేపట్టిన చందాలు వివరాలు వారంరోజుల్లో తెలియజేయాలని ఆదేశించారని తెలిసింది. దేవదాయశాఖకు సంబంఽధించిన జాతరలో పోలీసుల పెత్తనమేమిటని ఈఓను ప్రశ్నించారని, ఈ వ్యవహారం సీరియస్‌గా తీసుకుని, రాష్ట్ర దేవదాయశాఖకు తెలియజేస్తున్నట్లు తెలిసింది.
ఒక్కొక్కరు ఒక్కోలా మొర...
ఇదిలా ఉండగా రాజాం పట్టణ సర్కిల్ పోలీస్ అధికారిపై వచ్చిన కథనానికి బుధవారం కొంతమంది బాధితులు స్పందించారు. తమ గోడును వెళ్లబోస్తున్నారు. జాతరలో పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద ఓ స్వచ్ఛంద సంస్థ భక్తులకు మజ్జిగ చలివేంద్రాన్ని పెడితే అక్కడకు వెళ్లిన అధికారి 500 మజ్జిగ ప్యాకెట్లు ఇమ్మన్నారని తెలిసింది. మజ్జిగ ప్యాకెట్లు తమ వద్ద లేవంటే మజ్జిగ టిన్నులు (20 కిలోలు) ఐదు పంపించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇలా మజ్జిగ, బిర్యాణి, పులిహోర పొట్లాలు ఇచ్చిన బాధితులను కూడా పోలీసులు వదలకపోవడం కొసమెరుపు.
సాక్షి కథనంతో దేవదాయశాఖ అంతర్గత విచారణ
ఈఓతో డీసీ అత్యవసర సమీక్ష
యాత్రకు ఎంతొచ్చింది... ఎంత వసూలు చేశారు
వారంరోజుల్లో వివరాలు ఇవ్వండి
రూపాయి కూడా పోలీసులకు ఇవ్వొద్దు


