● క్వారీ వద్ద కొండకరకాం గ్రామస్తుల ఆందోళన
విజయనగరం రూరల్: మండలంలోని కొండకరకాం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న క్వారీలకు వెంటనే అనుమతులు రద్దు చేసి, గ్రామాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదాయార్జన కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై నిరసన గళం వినిపించారు. సర్వే నంబర్ 198లో రెండు క్వారీలకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. క్వారీ నిర్వహణవల్ల కొండ పైభాగంలో ఉన్న ఉమామహేశ్వరస్వామి దేవాలయం దెబ్బతింటుందన్నారు. రూ.30లక్షల విరాళాల సొమ్ముతో ఆలయానికి నిర్మించిన రోడ్డు మూసుకుపోతుందన్నారు. క్వారీకి వెనుక భాగాన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందని తెలిపారు. గ్రామంలో ఎటువంటి చెరువులు లేకపోవడంతో కొండకు ఆనుకుని ఉపాధిహామీ పనులు చేపడుతున్నామని, క్వారీ ఏర్పాటైతే ఆపని దొరికే పరిస్థితి లేదని వాపోయారు. పంచాయతీ పాలకవర్గం, ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏకపక్షంగా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కిలారి రమ్య, భోగాపురపు ఈశ్వరమ్మ, మాజీ సర్పంచ్ పాండ్రంకి గౌరినాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు కిలారి రాంబాబు, ఆదినారాయణ, టీడీపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.
క్వారీ ఏర్పాటుచేసే ప్రదేశం వద్ద
కొండకరకాం గ్రామస్తుల ఆందోళన


