● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లే వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గడిచిన 15 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తుచేశారు. జననేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజల పార్టీగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో, అన్యాయంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు, అక్రమ కేసులు బనాయించిన పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం అనిర్వచనీయమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లోను పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించాలని సూచించారు. స్వచ్ఛంద రక్తదాన, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


