పదండి.. మన ఆస్పత్రికి..! | - | Sakshi
Sakshi News home page

పదండి.. మన ఆస్పత్రికి..!

Mar 2 2026 7:17 AM | Updated on Mar 2 2026 7:17 AM

పదండి.. మన ఆస్పత్రికి..!

పదండి.. మన ఆస్పత్రికి..!

పదండి.. మన ఆస్పత్రికి..!

విజయనగరం ఫోర్ట్‌:

ఈ ఇద్దరు రోగులే కాదు.. సర్వజన ఆస్పత్రిలో నిత్యం ఇదే తంతు జరుగుతున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారిని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు సమాచారం. 108, ప్రైవేట్‌ అంబులెన్సుల్లో వచ్చే అత్యవసర రోగులు బెడ్‌పైకి రాకముందే ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. కొంతమంది రోగులకు ఓపీ తీయించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్‌ సిబ్బంది..

పట్టణంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను తరలించేందుకు ఉద్యోగులను నియమించుకున్నారు. వారంతా సర్వజన ఆస్పత్రిలో తిష్ట వేసి రోగులను మభ్యపెడుతూ తమ ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. వీరి హడావిడిని చూసి ఎవరైనా ప్రశ్నిస్తే తాము సర్వజన ఆస్పత్రి సిబ్బందిమని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రోగుల తరలింపు విషయంలో సర్వజన ఆస్పత్రికి చెందిన కొంతమంది వైద్యుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగులను తరలించే వైద్యులకు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు కమీషన్లు ముట్టజెప్పుతాయి.

చేతిచమురు వదిలించుకోవాల్సిందే..

అమాయక రోగులు ఒకవేళ ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే చేతి చమురు వదులించుకోవాల్సిందే. ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు అక్కడ లక్షల రూపాయలు గుంజేస్తున్నారు. ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం అందించాలని కోరితే.. ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి మోసగిస్తున్నారు. మరికొంతమంది విషయంలో ఆరోగ్యశ్రీ వర్తించినా.. ఏదో ఒక పేరు చెప్పి డబ్బులు లాగేస్తున్నారు.

సర్వజన ఆస్పత్రికి వస్తున్న రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలింపు

ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకం

వారికి సహకరిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

ఉచితంగా అందాల్సిన వైద్యానికి

రూ. లక్షల్లో ఖర్చు

ఎస్‌.కోట మండలానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తికి కొద్ది రోజుల కిందట పక్షవాతం రావడంతో సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. బెడ్‌పై రోగిని దించిన వెంటనే అక్కడే కాపు కాసిన ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన వ్యక్తి తమ ఆస్పత్రిలో అయితే మెరుగైన వైద్యం అందిస్తాం.. రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పి వారిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాడు.

గంట్యాడ మండలానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ చేయి వాపు వచ్చిందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు నీకు వెంటనే ఆపరేషన్‌ జరగాలని.. అయితే మెరుగైన వైద్యం త్వరగా అందాలంటే తాను ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లమని సూచించారు. అక్కడ ఎవరిని సంప్రదించాలో సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్‌ కూడా చీటీపై రాసి ఇచ్చారు.

ప్రైవేట్‌ వ్యక్తులను నిలువరిస్తాం..

సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. అయినా ప్రైవేట్‌ వ్యక్తులు ఆస్పత్రిలోకి రాకుండా కట్టడి చేస్తాం. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తాం.

– డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటిండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement