ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌లకు కట్టబెట్టేందుకు కుట
శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్‌లకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ అతిథిగృహంలో ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ.. ఏఐబీఈఏకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 వేల సభ్యత్వం ఉందన్నారు. ప్రధానంగా బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని కోరుతూ ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారన్నారు. అయితే కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేందుకే కార్మిక చట్టాల్లో మార్పులు చేశారన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేటర్ల చేతిలో పెడితే పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే తాము సమ్మె చేపట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ కోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బ్యాంకులలో తగినన్ని నియామకాలు చేపట్టకపోవడం వల్ల బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి పెరగడమే కాకుండా నిరుద్యోగ సమస్యలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం పర్మినెంట్ రిక్రూట్‌మెంట్లు చేయకుండా తాత్కాలిక నియామకాలు చేపట్టి యువతను మభ్యపెడుతోందన్నారు. వీటన్నిటినీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై మరిన్ని పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పార్వతీపురం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు టి. రవీంద్రనాథ్, ఉదయ్‌కుమార్, కమలాకర్, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం..
పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా ఎస్. సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం. చైతన్యతేజ, బి. సోమశేఖర్, కె. బాలకృష్ణ, రజనాన వినారాజ్, సెక్రటరీగా దిలీప్‌కుమార్ చౌదరి, డిప్యూటీ సెక్రటరీగా కె. కిశోర్‌కుమార్, జాయింట్ సెక్రటరీలుగా కె. పల్లవి, జి. మధుసూదనరావు, ఎం.సంతోష్, కె.శోభారాణి, ఎంవీ రవికుమార్, ఎస్. సింహగిరి, ఎం. చలపతిరావు, డి.జయశంకర్, ట్రెజరర్‌గా ఎం.రాధాకుమారి, జాయింట్ ట్రెజరర్‌గా జి. తేజేశ్వరరావు, కమిటీ మెంబర్స్‌గా ఆర్.రాజేశ్వరి, పి.నవీన్, వై.విద్యాసాగర్, కె.శ్రీనివాసరావు, శివ శ్రీను, భాస్కరరావు, బి శ్రీనివాసరావు, టి. సతీష్‌కుమార్ తదితరులు ఎన్నికయ్యారు.
దెబ్బతిననున్న పేద, మద్యతరగతి
ప్రయోజనాలు
ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే ఈ సమావేశాలు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు


