రేడియాలజీ ప్రొఫెసర్ శిక్షణ ఇవ్వరట..!
● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సింహగిరి కాలేజీ విద్యార్థుల ఫిర్యాదు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రేడియాలజీ ప్రొఫెసర్ ఎం.శివశ్రీధర్ తమకు శిక్షణ ఇవ్వనంటున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు పట్టణంలోని కేఎల్‌పురానికి చెందిన సింహగిరి కాలేజ్ ఆఫ్ పారామెడికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు , కళాశాల ప్రతినిధులు గురువారం ఫిర్యాదు చేశారు. సర్వజన ఆస్పత్రిలో శిక్షణ పొందడానికి పారామెడికల్ బోర్డు, ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి ఇచ్చారని , అయినప్పటికీ తమకు శిక్షణ ఇవ్వనని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్లమో మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ(డీఎంఏటీ) కోర్సు చదివేందుకు సింహగిరి కాలేజీలో చేరామని తెలిపారు. 16 మంది విద్యార్ధులకు సర్వజన ఆస్పత్రిలో సిటిస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే విభాగాల్లో శిక్షణ పొందడానికి అవసరమైన అన్ని అనుమతులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు కూడా కాలేజీ వారు చెల్లించారని తెలిపారు. ఈనెల 9న శిక్షణ పొందేందుకు రేడియాలజీ విభాగానికి వెళ్లగా మీకు ఇక్కడ ట్రైనింగ్ (శిక్షణ) ఇవ్వమని చెప్పడంతో నాలుగు రోజులుగా ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నామని వాపోయారు. ఇదేవిషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా డాక్టర్ శివశ్రీధర్ సింహగిరి కాలేజ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనని చెప్పడం వాస్తవమేనన్నారు. దీనిపై డీఎంఈ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపానని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఎం.భాను, సీహెచ్.అశ్విని, కె. పావని, డి.కొండమ్మ, ఆర్.ప్రవీణ్, తేజ, కళాశాల ప్రతినిధి పైడినాయుడు తదితరులు ఉన్నారు.


