శివ..శివా..
వంగర: పింఛన్ల పంపిణీ అంటే సరే అన్నారు.. సర్వేలు చేయమని ఆదేశిస్తే ఊకొట్టారు.. ఇతర శాఖల పనులు అప్పగిస్తే అయిష్టంగా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా శివరాత్రి ఉత్సవాల విధులను సచివాలయ ఉద్యోగులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైందంటూ ఆవేదన చెందుతున్నారు. వివిధ రకాల సర్వేలు, టార్గెట్లతో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులను మరింత అవమానకర రీతిలో మరుగుదొడ్ల వద్ద, ఉత్సవాల్లోని నదీతీర రేవుల వద్ద, క్యూలు, ఆసీల వసూళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు అప్పగించడంతో మానసిక క్షోభకుగురవుతున్నారు. తాము చదివిన చదువు ఏంటి? అప్పగిస్తున్న విధులు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
శివరాత్రి ఉత్సవాలకు షిప్టుల వారీ విధులు
వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద సాగే శివరాత్రి ఉత్సవాలకు సచివాలయ ఉద్యోగులకు చీపురుపల్లి ఆర్డీఓ ఆదేశాల మేరకు విధులను కేటా యిస్తూ ఎంపీడీఓ తులా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిషత్ నుంచి 32 మంది, రెవెన్యూ శాఖ నుంచి ఏడుగురు వీఆర్‌ఓలకు సంగాంలో డ్యూటీలు వేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఎవరెవరు ఏఏ షిఫ్టులలో విధులకు హాజరు కావాలో అందులో పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మహిళా ఉద్యోగులు అని చూడకుండా రాత్రి సమయంలో డ్యూటీలకు షిఫ్ట్‌లు వేయడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. కొంత మంది మహిళా ఉద్యోగుల్లో సచివాలయాల కార్యదర్శులు, మహిళా పోలీసులకు ఉదయం 6 గంటలకే తొలి షిఫ్ట్‌కు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధులకు డుమ్మా కొడితే బాధ్యతారాహిత్యం కింద సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారు.
ఉన్నత చదువులు చదువుకొని.....
ఉన్నత చదువులు చదువుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువతతో పోటీపడి గత ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగాలు సాధించారు. గత ఐదేళ్లూ పల్లె ప్రజలకు సేవలందించి సమాజంలో గౌరవాన్ని పొందారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో సచివాలయాల ఉద్యోగులను పదేపదే వేధిస్తోందని పలువురు ఉద్యోగులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆలయం వద్ద క్యూలైన్లు, స్నానాలు రేవు వద్ద, పిండ ప్రదానాలు చేసే ప్రదేశంలో, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు కేటాయించడమంటే.. వ్యవస్థను నిర్వీర్యం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
సంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయం
గతంలో రాత్రి విధులు
కేటాయించలేదు
గతంలో ఉత్సవాలు సమయంలో రాత్రి విధులకు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీసులకు కేటాయించలేదు. ఇప్పటికే వివిధ రకాల సర్వేలు, వివిధ శాఖల పరిధిలో ఉన్న అదనపు పనులు చేస్తున్నాం. పని భారంగా ఉంది. దీనికి తోడు రాత్రి సమయంలో డ్యూటీలు వేయడం తగదు.
– అల్లెన కృష్ణవేణి, మహిళా పోలీస్, సంగాం
ఆర్డీఓ ఆదేశాలతో..
చీపురుపల్లి ఆర్డీఓ ఆదేశాలతో సచివాలయాల ఉద్యోగులకు షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించాం. వీరంతా సంగాంలో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు ఆదేశాలు అమలు చేశాం.
– తులా రాజారావు, ఎంపీడీఓ, వంగర
సచివాలయ సిబ్బందికి మహాశివరాత్రి ఉత్సవాల విధులు
ఆర్డీఓ ఆదేశాల మేరకు జాబ్
చార్టును వేసిన ఎంపీడీఓ
మహిళా పోలీసులు, ఉద్యోగులకు
రాత్రి విధులు
గర్భిణులైన ఉద్యోగులకూ విధుల
కేటాయింపు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
భగ్గుమంటున్న ఉద్యోగులు
శివ..శివా..


