బొబ్బిలి, సాలూరుకు కొత్త మార్గం
● గిరిజన గ్రామాలకు తీరనున్న
దశాబ్దాల కష్టాలు
● వైస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే
అనుమతులు, నిధులు మంజూరు
బొబ్బిలిరూరల్: బొబ్బిలి నుంచి రామన్నదొరవలస, మోసూరువలస మీదుగా సాలూరు వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణం దాదాపు పూర్తయింది. సుమారు మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంత గిరిజనులు ఈ రహదారి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. బొబ్బిలి నుంచి రామభద్రపురం మీదుగా కంటే ఈ రహదారి నుంచి సాలూరు పట్టణానికి చేరుకుంటే దాదాపు 6 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. దీంతో అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాగే దాదాపు 12 గిరిజన గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఇన్నాళ్లూ వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అటవీశాఖకు చెందిన కొంత భూమి ఈ రహదారి గుండా ఉండడంతో ఆశాఖ రహదారి నిర్మాణ పనులను అడ్డుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ రహదారి నిర్మాణానికి అన్ని అనుమతులు ఇస్తూ 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ రహదారినిర్మాణానికి పూనుకుంది. దాదాపు రూ.8.24 కోట్ల వ్యయంతో రామన్నదొరవలస నుంచి సాలూరు మండలం బోరబందవరుకు బీటీ రోడ్డును నిర్మిస్తోంది. ప్రస్తుతం రోడ్డు పనులు 90శాతం పూర్తికాగా ఈ నెలాఖరుకు రహదారి నిర్మాణం పూర్తిచేస్తామని పీఆర్‌పీఐయూ ప్రాజెక్టు డీఈ ఎన్.సీతంనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన రహదారి పనులను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చినాటికి రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


