కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
విజయనగరం కలెక్టరేట్: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లెంకా దినకర్ ఆరా తీశారు. కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్‌జీవన్‌మిషన్, గృహనిర్మాణం, ఉపాధి, విద్యాపథకాల అమలును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ కట్టెలపొయ్యిలపైనే మధ్యాహ్నభోజనం వండుతున్నారన్నారు. ఎస్.కోట ప్రాంతంలో శుద్ధిచేయని నీటితోనే వంట చేస్తున్నారని, వేపాడలో బురదనీటిని తాగునీటిగా వినియోగిస్తున్నారని తెలిపారు. జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి తాగునీటి కష్టాలకు చెక్‌చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


