రెవెన్యూ వసూళ్లలో వెనుకబాటు
● కీలకశాఖల్లో లక్ష్యాలకు దూరంగా ప్రగతి ● సమీక్షలో గుర్తించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పలుశాఖల్లో తీవ్ర లోటుపాట్లు ఉన్నట్లు స్పష్టమైంది. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లు జరగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో 98.29 శాతం పురోగతి నమోదైనప్పటికీ ఇంకా పూర్తి లక్ష్యసాధన జరగకపోవడంపై గుర్తుచేశారు. ఫిబ్రవరి నెలలో అదనపు భారం పడనున్న నేపథ్యంలో వసూళ్లపై మరింత శ్రద్ధ చూపి లక్ష్యాలను సాధించుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ అసహనం
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో రూ.1,373.10 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.1,275.01 కోట్లు మాత్రమే వసూలవడంతో దాదాపు రూ.98 కోట్ల లోటు నెలకొంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నప్పటికీ వసూళ్లలో ఆశించిన వేగం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వాణిజ్యపన్నుల శాఖలో జనవరి వరకు రూ.322.20 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.238.20కోట్లు మాత్రమే వసూలవడం వల్ల 73.92 శాతానికి పురోగతి పరిమితమైంది. ఇతర శాఖలతో సమన్వయం లోపించకుండా చూసుకుని లక్ష్యాలను సాధించుకోవాలని సూచించారు. గనులు, భూగర్భశాఖలో రూ.124 కోట్ల లక్ష్యానికి రూ.71.93 కోట్లు మాత్రమే వసూలవడం ద్వారా పెద్దస్థాయిలో ఆదాయ లోటు స్పష్టమైంది. లే అవుట్లు, లీజులు, రవాణా అంశాలపై పర్యవేక్షణ బలహీనంగా ఉండడమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ పరిధిలో డిటెక్షన్, క్వార్టర్లీ లైఫ్ ట్యాక్స్, ఫీజుల వసూళ్లలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని సమీక్షలో అధికారులపై అసంతృప్తి కలెక్టర్ వ్యక్తం చేశారు. అటవీశాఖ ద్వారా జనవరి వరకు రూ.35.857 లక్షలు మాత్రమే వసూలవడం కూడా ఆశించిన స్థాయికి తగ్గిందని సమీక్షలో వెల్లడైంది. దీంతో అక్రమ కార్యకలాపాల నియంత్రణలో రోజువారీ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం స్వయంగా అంగీకరించిన పరిస్థితి నెలకొంది. సమావేశంలో జీఎస్‌టీ జాయింట్ కమిషనర్ జి.నిర్మలజ్యోతి, జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు, చిట్స్ రిజిస్ట్రార్ ఎస్‌ఎస్‌రేవతి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.శ్రీరంగందొర, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డి.మణికుమార్, మైన్స్ అండ్ జియోలజీ జిల్లా అధికారి సీహెచ్.సూర్యచంద్రరావు, ఎంవీఐ దుర్గాప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


