
యువకుడి దుర్మరణం
రామభద్రపురం: పండగ పూట బొబ్బిలి మండలం పారాది గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తగరపువలసలోని దివిస్ ఫార్మా కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వినాయక ఉత్సవాలకు గ్రామానికి వచ్చిన ఒక్కగానొక్క కొడుకును లారీ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీంగా ఉంది. ప్రమాదంలో దుర్మరణం చెంది రోడ్డు పక్కన పడి ఉన్న కొడుకును చూసి ఆతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని బొబ్బిలి స్మార్ట్ సిటీ సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో యువకుడు పువ్వల బాలాజీ(21) మృతిచెందాడు. బొబ్బిలి మండలంలోని పారాది గ్రామానికి చెందిన బాలాజీ తన ద్విచక్రవాహనంపై వినాయక చవితి పండగ పనుల నిమిత్తం రామభద్రపురం వస్తున్నాడు. సరిగ్గా స్మార్ట్ సిటీ సమీపంలోకి వచ్చిన సమయానికి రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు ఎదురుగా వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పండగ విషాదం
బైక్‌ను లారీ ఢీకొనడంతో ప్రమాదం
వినాయక ఉత్సవాలకు వచ్చి అనంతలోకాలకు
గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు

యువకుడి దుర్మరణం