● గజఈతగాళ్లతో గాలింపు
● లభ్యం కాని ఆచూకీ
● రోదిస్తున్న కుటుంబసభ్యులు
పాచిపెంట: గిరిజన మత్స్యకారుల బతుకు చిత్రం ప్రతిక్షణం ప్రమాదకరంగా ఉంటోంది. వర్షాలు పడుతున్నా ప్రాణాలకు తెగించి వలవిసరక తప్పదు. లేకుంటే ఇంటిల్లిపాది పిల్లాపాపలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. వినాయక చవితి సందర్భంగా వర్షం కురుస్తోంది. జలాశయానికి నీటి ఉధృతి పెరుగుతుందని తెలుసు, కానీ పొట్టకూటి కోసం చేపలవేటకు వెళ్లిన పాచిపెంట మండలంలోని కోడికాళ్ల వలస గ్రామానికి చెందిన మత్స్యకారుడు పెద్ద గెడ్డ జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోటికిపెంట పంచాయతీ, కోడికాళ్లవలస గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(37) వత్తిరీత్యా పెద్దగడ జలాశయానికి చేపల వేటకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. రోజులాగానే బుధవారం ఉదయం పెద్దగెడ్డ జలాశయానికి చేపలవేటకు వెళ్లాడు. వల తీస్తున్న సమయంలో వరద ఉధృతికి నాటు పడవ బోల్తా పడడంతో జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే డ్రోన్ వినియోగించి గల్లంతైన వ్యక్తి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. బాలరాజు గల్లంతైన వార్త విని కోడికాళ్లవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. గల్లంతైన వ్యక్తికి భార్య జన్ని బుజ్జి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
గిరిజన మత్స్యకారుడి గల్లంతు
గిరిజన మత్స్యకారుడి గల్లంతు