మామిడి రైతుల ఆర్థిక ప్రయోజనాలకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతుల ఆర్థిక ప్రయోజనాలకు చర్యలు

Aug 29 2025 7:12 AM | Updated on Aug 29 2025 2:33 PM

జిల్లా ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్‌ 

తెర్లాం: జిల్లాలో క్లస్టర్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద మామిడి పంట ఎంపికై నందున మామిడి రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సీహెచ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని పెరుమాళి గ్రామ రైతు సేవా కేంద్రంలో రామభద్రపురం ఉద్యాన శాఖ అధికారి మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో మామిడి రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. 

ఈ ఏడాది నుంచి జిల్లాలో క్లస్టర్‌ డవలప్‌మెంట్‌ ప్రోగాం కింద మామిడి పంట ఎంపిక కావడంతో మామిడికి విలువ అథారిత ఉత్పత్తులు, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలు కల్పించే పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. వీటి ద్వారా జిల్లాలోని మామిడి రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. మామిడి రైతులు పంటపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. నూజివీడు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ రాధారాణి మాట్లాడుతూ మామిడి పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, సస్యరక్షణ చర్యలపై వివరించారు. 

అనంతరం పెరుమాళిలోని మామిడి తోటల్లో శాస్త్రవేత్త డాక్టర్‌ రాధారాణి పర్యటించి రైతులకు తెగుళ్ల, వాటి నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. శిక్షణలో వైస్‌ ఎంపీపీ చేపేన సత్యనారాయణ, అప్పలరాజు, మామిడి రైతుల ఉత్పత్తిదార్ల సంఘం మండల అధ్యక్షుడు గొందాల వెంకటరావు, పలువురు సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ సంయుక్త కార్యదర్శిగా సామంతుల

రాజాం : మండలంలోని కంచరాం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సామంతుల వెంకటప్పలనాయుడును ఆ పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమించినట్టు గురువారం పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ పదవిని ఇచ్చినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తన సేవలు గుర్తించి, బాధ్యతాయుతమైన పార్టీ పదవిని కట్టబెట్టినందుకు తన వంతు బాధ్యతాయుత సేవలు అందిస్తానని అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, పార్టీ రాజాం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తలే రాజేష్‌ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

శభాష్‌ అజయ్‌బాబు..!

కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం

నెల్లిమర్ల రూరల్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న సీనియర్‌ కామన్‌వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్‌బాబు సత్తా చాటాడు. 79 కిలోల కేటగిరిలో బరిలోకి దిగిన అజయ్‌బాబు స్నాచ్‌ 152 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 183 కిలోలు... మొత్తంగా 355 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

ఈయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించి దేశ ప్రతిష్టను ఖండాంతరాల్లో ఇనుమడింపజేశారు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అజయ్‌బాబు సైతం నిత్యం కఠోర సాధన చేస్తూ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నాడు. తాజాగా జరిగిన ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం సాధించడంతో గ్రామస్తులు, జిల్లాకు చెందిన క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. శభాష్‌ అజయ్‌బాబు అంటూ కీర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement