
ఆటల్లేవ్..ఆడుకోవడాల్లేవ్..!
పార్వతీపురం రూరల్: విద్యార్థుల్లో చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు ఎంతగానో దోహదపడేవి క్రీడలు, వ్యాయామం. ఇంటర్ విద్యనుంచి క్రీడలు, వ్యాయామం ప్రతి విద్యార్థికి అవసరం. విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా ఆడించేందుకు గురువులు కరువయ్యారు. సాధన చేయలేక, మెలకువలు చెప్పేవారే లేక, విద్యార్థులు ఉదాసీనంగా మిగిలిపోతున్నారు. ఇంటర్‌మీడియట్ రెండేళ్లలో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు క్రీడా జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 14 జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఆటలకు నోచుకోవడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే కళాశాల విద్యార్థులకు చదువుతోపాటు ఇతర అంశాల్లో ప్రతిభ చాటితే కచ్చితమైన ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది.
నష్టపోతోంది పేద విద్యార్థులే
పల్లె, పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకుచెందిన విద్యార్థులు ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతారు. నేటి పోటీ ప్రపంచంలో వారికున్న అవకాశాలను వినియోగించుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కలలు కంటారు. విద్యతోపాటు మరో నైపుణ్యం కలిగి ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితులు నేడు సంతరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేక జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 15 కళాశాలల్లోని 5,800మంది విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. అలాగే క్రీడలకు, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఏ విద్యార్థి అయినా తనకు ఉత్సాహంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోరిక ఉన్నప్పటికీ సొంతంగా సాధన చేసేందుకై నా అవకాశం లేని పరిస్థితులు జూనియర్ కళాశాలల్లో వేలెత్తి చూపుతున్నాయి. దీంతో క్రీడల్లో ప్రోత్సాహం కరువై క్రమంగా విద్యార్థులకు ఆటలపై ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేవారికి క్రీడా కోటా కింద రిజర్వేషన్ వర్తిస్తుంది. చదువుకు ఇది అదనపు అర్హతగా గుర్తింపునిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్ధులు ఈ అవకాశాలు కోల్పోతున్నారు.
15 కళాశాలలకు ఒకే పీడీ
ఆటలకు దూరమవుతున్న ఇంటర్
విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు 5,800 మంది
ఆటలాడించే గురువే కరువు
వ్యాయామం, క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు

ఆటల్లేవ్..ఆడుకోవడాల్లేవ్..!