
శ్రీమద్రమారమణ గోవిందా..హరి!
విజయనగరం టౌన్: హరికథా పితామహుడికి విజయనగర వాసులు ఘనంగా నీరాజనం పలికారు. శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాస 161వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆదిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు నేతృత్వంలో ఆదివారం ఉదయం కానుకుర్తివారి వీధిలో ఉన్న ఆదిభట్ల గృహంలో పూజలు నిర్వహించారు. అనంతరం వెన్‌లాక్ పార్కు, సంగీత కళాశాలలో ఉన్న ఆదిభట్ల విగ్రహానికి పుష్పమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన హరికథా గానామృతం ఆద్యంతం ప్రేక్షలకులను కట్టిపడేసింది. ఎం.వీరసత్య (అమలాపురం) శ్రీరామ జననం రక్తికట్టించింది. ఎం.సిరివల్లి (గుంటూరు) విశ్వామిత్ర యాగ సంరక్షణం హరికథ ఆకట్టుకుంది. సాయంత్రం 6గంటలకు ఆదిభట్ల రవిభాగవతార్‌తో, 7 గంటలకు హరికథా చూడామణి వై.శిఖామణి భాగవతారిణితో శ్రీరామపాదుకా పట్టాభిషేకం, హరికథలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో ఆరాధనోత్సవ సంఘం ప్రతినిధులు పీవీ.నరసింహరాజు(బుచ్చిబాబు) అధిక సంఖ్యలో సభ్యులు, హరికథా కళాకారులు పాల్గొన్నారు.
నేడు హరికథా చూడామణి బిరుదు ప్రదానం
ఆదిభట్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రెండోరోజు సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్.గీత (కర్ణాటక) సీతా కల్యాణం, 11 గంటలకు మండా వరలక్ష్మి భాగవతారిణి హరికథ, సాయంత్రం హరికథాచూడామణి కాళ్ల నిర్మల సుందరకాండ హరికథ ఉంటాయి. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో ప్రొద్దుటూరు శ్రీ అన్నమాచార్య కళాపీఠంకి చెందిన యడ్లవల్లి రమణయ్య భాగవతార్‌కు హరికథా చూడామణి బిరుదు ప్రదానం చేయనున్నారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా పురస్కార ప్రదానం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాత్రి పురస్కార గ్రహీత భక్త మార్కండేయ కథాగానాలాపన చేస్తారన్నారు. సాహితీవేత్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు.
హరికథా పితామహుడికి..ఘనంగా నీరాజనం
భక్తిశ్రద్ధలతో ఆదిభట్ల 161వ జయంతి మహోత్సవాలు
ఆకట్టుకున్న ‘సర్వారాయ’ విద్యార్థినుల గానామృతం

శ్రీమద్రమారమణ గోవిందా..హరి!

శ్రీమద్రమారమణ గోవిందా..హరి!