
వినతులపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన సమస్యలకు సంబంధించిన వినతులపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సబ్‌కలెక్టర్ ఆర్.శాలి, డీఆర్‌ఓ హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణిలు అర్జీదారుల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ వారు తెలిపిన ప్రతి సమస్యను సావధానంగా విని తగిన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.
వచ్చిన వినతుల్లో కొన్ని..
సీతంపేట మండలం పొడిదుమ్ము నుంచి దారబంద వరకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలి. కురుపాం మండలం పిరంగూడ నుంచి అడ్డాయిగూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలి. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ నుంచి వల్లాడ వరకు సీసీ రోడ్డు మంజూరు చేయాలి. కురుపాం మండలం పట్టాయి గెడ్డలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం పూర్తిచేయాలి. గతేడాదిలో ఎంపికై న డీలర్లకు నియామక పత్రాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 73 వినతులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖాధికారులు కె.రాబర్ట్‌పాల్, వై.క్రాంతికుమార్, టి. కొండలరావు, డా.ఎస్.భాస్కరరావు, ఐసీడీసీ, డ్వామా పీడీలు టి. కనకదుర్గ, కె.రామచంద్రరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, సీపీఓ ఎస్‌ఎస్‌ఆర్‌కె పట్నాయిక్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్‌శాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలపై విచారణ చేసి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో 7 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ గ్రీవెన్స్‌సెల్‌కు 55 అర్జీలు
సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వివిధ శాఖల సెక్టోరియల్ అధికారులు హాజరు కాకపోతే మెమోలు ఇవ్వాలని ఐటీడీఏ పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్‌ఆర్ శంకరన్ సమావేశమందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు సమయపాలన పాటించాలని, పీజీఆర్‌కు ఎవరెవరు వచ్చారో సంతకాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.అందరూ బాధ్యతగా పనిచేసి వచ్చిన అర్జీలను తక్షణ పరిష్కారం చూపాలన్నారు. మొత్తం 55 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చాయి. ఓండ్రుజోలలో జీపీఎస్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతి ఇచ్చారు. తాగునీటి బోరు మంజూరు చేయాలని జరడగూడ గ్రామానికి చెందిన ఆరిక చిన్నారావు, తల్లికి వందనం డబ్బులు తమ పిల్లలు ఇద్దరికి రాలేదని పోలిష్‌కోటకు చెందిన బిడ్డిక బెన్నయ్య విన్నవించారు. భాషావలంటీర్‌ను నియమించాలని జన్నిగూడ గ్రామస్తులు కోరారు. ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని పోలవరానికి చెందిన ఊయక బోడమ్మ విన్నవించింది. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, డిప్యూటీ ఈవో రామ్మోహన్‌రావు, ఎంపీడీవో సత్యం, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు.

వినతులపై తక్షణమే స్పందించాలి

వినతులపై తక్షణమే స్పందించాలి