అభివృద్ధిపై ప్రజా వేదికకు సిద్ధమా..! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై ప్రజా వేదికకు సిద్ధమా..!

Sep 1 2025 4:14 AM | Updated on Sep 1 2025 4:14 AM

అభివృద్ధిపై ప్రజా వేదికకు సిద్ధమా..!

అభివృద్ధిపై ప్రజా వేదికకు సిద్ధమా..!

చీపురుపల్లి: అభివృద్ధి, ప్రజల కష్టాలు, ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి అంశాలపై మాట్లాడే అర్హత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుకు ఉందా.... అసలు ఎన్నోసార్లు క్యాబినేట్‌లో ఉన్న కళా ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే కాదు కనీసం ఆయన స్వంత గ్రామానికై నా ఏమైనా అభివృద్ధి చేసారా... ? అలాంటి సీనియర్‌ నాయకుడు అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ(పీఏసీ) మెంబర్‌, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు ‘బొత్స’ చేసిందేమిటని ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రశ్నించడంపై ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చించుకునేందుకు ఎమ్మెల్యే కళా వెంకటరావు సిద్ధమైతే ప్రజావేదికలో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజావేదిక స్థలం, సమయం, తేదీ ఎమ్మెల్యే చెప్పినా సరేనని, లేదంటే తామే చెబుతామని, ఆ రోజున అభివృద్ధిపై ఆధారాలతో సహా తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బెల్లాన స్పష్టం చేశారు. ఎంతో సీనియర్‌ నాయకునిగా, ఎన్నోసార్లు క్యాబినేట్‌ మంత్రిగా పని చేసిన కళా వెంకటరావు కేవలం బొత్సను విమర్శిస్తే మరోసారి మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో రాజాంలో కూర్చుని మాట్లాడుతుండడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవడమేనా ఆయన సీనియారిటీ అంటూ ప్రశ్నించారు. మహానేత వైఎస్సార్‌ హయాంలోనే బొత్స ఆధ్వర్యంలో రూ.79 కోట్లుతో ‘కళా’ స్వంత నియోజకవర్గంలోని సంకిలిలోని నాగావళి నది నుంచి నీరు తెచ్చి ఇందిరమ్మ సుజలధార పేరుతో చీపురుపల్లి నియోజవకర్గంలో ఇంటింటి కుళాయిలు అందించినట్లు గుర్తు చేశారు. అదే సమయంలో తోటపల్లి సాగు నీటి ప్రాజెక్టు పనులు చేపట్టి ఉమ్మడి జిల్లాలో 1.60 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగు నీరు అందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఖరీఫ్‌ సీజన్‌లో కనీసం సాగునీరు కూడా నియోజకవర్గంలో రైతులకు అందలేదన్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఉత్తుత్తి కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేస్తే 2019 నుంచి 2024 మధ్య ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్ని సమస్యలు పరిష్కరించి శంకుస్థాపన చేసి 2024 లోపు 23 శాతం పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వస్తే తమ సొంత సామాజిక వర్గానికి చెందిన మిమ్స్‌ కళాశాలకు ఎక్కడ నష్టం వస్తుందోనని అశోక్‌గజపతిరాజు మెడికల్‌ కళాశాలను రాకుండా చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి బొత్స ఆధ్వర్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మెడికల్‌ కళాశాల మంజూరు చేసి పనులు పూర్తి చేసి ప్రారంభించినట్టు చెప్పారు. జిల్లాలో జేఎన్‌టీయూ, గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాల ఎవరి హయాంలో వచ్చాయో కళా చెప్పాలన్నారు. బొత్స కంటే ముందు ఎన్నో ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కళా వెంకటరావు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేసారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులను ఓసీలుగా గుర్తించడంతో ఎన్నో ఇబ్బందులు పడేవారని, తమ నేత బొత్స సత్యనారాయణ హయాంలో ఈ సమస్యను మహానేత వైఎస్సార్‌ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో ఉన్న తూర్పుకాపులందరికీ బీసీ డీ రిజర్వేషన్‌ అమలు చేసిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. చీపురుపల్లిలో ఆర్‌వోబీ నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో 2003లో రూ.13 కోట్లు నిధులు మంజూరు చేసి, 2024 ఎన్నికలు జరిగే సమయానికి 75 శాతం పనులు పూర్తయితే మిగిలిన పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని చెప్పిన పవన్‌కల్యాణ్‌, కింజరాపు రామ్మోహననాయుడు దగ్గరుండి ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని అందరికీ అర్థమవుతోందన్నారు. ప్రధానమంత్రి వైజాగ్‌ వచ్చినా విడిది చేసేందుకు అనువుగా ఉండే భవనాన్ని రుషికొండలో నిర్మిస్తే ఎలా వినియోగించాలో తెలియని ప్రభుత్వం పెచ్చులు ఊడిపోయాయంటూ పవన్‌కల్యాణ్‌ షో చేయడం హాస్యాస్పదంగా ఉంది. యూరియా, సాగు నీరు లేక రైతులు అల్లాడిపోయి బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటే పట్టించుకునే తీరిక లేని ఎమ్మెల్యేలు ఇళ్లల్లో కూర్చుని ప్రెస్‌మీట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ నాయకులు ఇప్పిలి తిరుమల, కొమ్ము చిరంజీవి, ముల్లు పైడిరాజు, పనస వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

కళా వెంకటరావుకు మాజీ ఎంపీ

బెల్లాన సవాల్‌

వేదిక, సమయం మీరు చెబుతారా..

మేమే చెప్పాలా..

ఆధారాలతో అభివృద్ధిని చూపిస్తాం..

‘బొత్స’ను విమర్శిస్తే మంత్రి పదవి

వస్తుందనుకుంటున్నారా..

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదవడమేనా మీ సీనియార్టీ

తూర్పుకాపుల కోసం కళా చేసిందేమిటో చెప్పాలి

ఎరువులు, సాగునీటి కష్టాలు

కనిపించడం లేదా...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement