
మోటారు వాహన చట్టాలను వ్యతిరేకించండి
బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఆటో వర్కర్ల సంఘ నాయకులు ఎల్లంనాయుడు తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చి జరిమానాలు, జైలుశిక్షలను వేధిస్తోందన్నారు. దేశంలోని రవాణా రంగాన్ని ప్రైవేటుకు అప్పగించే కుట్రకు కేంద్రం దారులు తెరిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్, బ్రేక్, ఫిట్నెస్ తదితర ధ్రువపత్రాల పేరిట భారీ చలానాలు విధించి మోటారు కార్మికుల కష్టాన్ని దోచుకుంటోందన్నారు. ఇది సరిపోక ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులను వీధిన పడేసిందన్నారు. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా కనీసం అవకాశం లేకుండా చేసిందన్నారు. వీరందరినీ ఆదుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 4న ఉదయం 9 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.