
యూరియా.. బంగారమాయే..!
ఎన్ని ఎకరాలున్నా... ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్న వైనం యూరియా దొరక్కపోవడంతో కాంప్లెక్సు ఎరువులు వేస్తున్న రైతులు కొన్ని మండలాల్లో గుళికలు అంటగడుతున్న డీలర్లు అధిక శాతం ఆర్‌ఎస్‌కేల్లో దొరకని యూరియా
పోలీసుల సమక్షంలో...
ఈ ఫొటోలో వర్షంలో సైతం గొడుగులు వేసుకొని నిరీక్షిస్తున్నది మెంటాడ మండలం జయితి గ్రామంలోనిది. యూరియా కోసం రైతులు గంటలు తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామంలో 800 మంది రైతులు ఉన్నారు. అయితే ఈ రైతు సేవ కేంద్రానికి కేవలం 260 యూరియా బస్తాలు వచ్చాయి. దీంతో రైతులందరికి యూరియా బస్తాలు దొరక్క చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు పొట్టంగి అచ్చుత్. ఇతనిది మెంటాడ మండలం జయితి గ్రామం. యూరియాకు రైతు సేవ కేంద్రానికి వెళ్లాడు. వరుసలో ఉన్నప్పటకీ యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఇతనికి నాలుగు బస్తాలు అవసరం ఉంది. ఒక్క బస్తా కూడా దొరకలేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సూరెడ్డి సత్యనారాయణ. ఇతనిది మెంటాడ మండలం లోతు గెడ్డ గ్రామం. యూరియా కోసం రైతు సేవ కేంద్రానికి వెళ్తే దొరకలేదు. దీంతో ప్రైవేటు డీలరు దగ్గరకు వెళ్తే యూరియా బస్తాతో పాటు రూ.500 విలువ చేసే గుళికలు కొనుగోలు చేయాలని చెప్పడంతో చేసేది లేక 28.28.0 ఎరువును బస్తా రూ.1700 చొప్పున కొనుగోలు చేశాడు.
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన పి.రమణ గ్రామంలోని రైతు సేవ కేంద్రానికి వెళ్తే మూడు గంటలు వరుసలో ఉంటే ఒక బస్తా యూరియా ఇచ్చారు. ఇతనికి మూ డు బస్తాలు యూరియా అవసరం. మిగతా రెండు బస్తాలు ఎక్కడో కొనుగోలు చేయాలో తెలియక అవస్థలు పడుతున్నాడు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని మండలాల్లో యూరి యా దొరక్కపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రైతు సేవ కేంద్రాలకు పూర్తి స్థాయిలో యూ రియా రాకపోవడంతో రైతులందరికీ యూరి యా అందని పరిస్థితి. గత టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి ఉండేదని. మళ్లీ ఇప్పడు అదే పరిస్థితి వచ్చిందని రైతులు చర్చించుకుంటున్నారు.
ఎన్ని ఎకరాలున్నా.. ఒక్క యూరియా బస్తే ఇస్తున్నారు...
తమకు ఎన్ని ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని రైతు లు ఆవేదన చెందుతున్నారు. నాలుగైదు బస్తాలు యూరియా అవసరమైన వారికి ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తే మిగతా బస్తాలు ఎక్కడ కొనుగోలు చేయాలని తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది రైతులు యూరియా కోసం వరుసలో ఉన్నప్పటకీ దొరక్కపోవడంతో ఆవేదన చెందుతున్నా రు. ఓ వైపు కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతుంటే.. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. క్షేత్ర స్థాయిలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.
గత్యంతరం లేక...
యూరియా దొరక్కపోవడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంప్లెక్సు ఎరువులు వేస్తున్నారు. ధర ఎక్కువ అయినప్పటకీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు కాంప్లెక్సు వేయాల్సిన దుస్థితి. యూరియా బస్తా ధర రూ.267 కాగా.. అవి దొరక్కపోవడంతో రూ.1700 విలువ చేసే 28–28–0 వంటి కాంప్లెక్సు ఎరువులు వేస్తున్నారు.
గుళికలు, జింక్ అంటగడుతున్న డీలర్లు
యూరియా కోసం ప్రైవేటు డీలర్లు దగ్గరకు వెళ్లే రైతులకు గుళికలు, జింక్ వెంటగడుతున్నారు. యూరియా బస్తా రూ.300 కాగా రూ.500 విలువ చేసే గుళికలు అంటగడుతున్నారు. దీని వల్ల ఒక యూరియా కొంటే రూ.800 అవుతుంది. మెంటాడ మండలంలో ఓ డీలరు ఒక రైతుకు రెండు బస్తాలు యూరియా కొంటే రెండు గుళికల డబ్బాలు ఇచ్చి రూ. 600 తీసుకున్నట్టు తెలిసింది.
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ గురువారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది రైతన్నలకు ఎరువులు సరఫరా చేయడంలో విఫలమైంది. పది ఎకరాలు ఉన్న రైతుకై నా.. ఒక్క యూరియా కట్ట చొప్పున అధికారులు అందజేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంకిలికి 200 బస్తాలు వస్తే 600 మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. పోలీసుల సమక్షంలో 200 మందికే పంపిణీ చేశారు.
తోపులాటలో పడిపోయిన వృద్ధురాలు
గజపతినగరం : మండలంలోని కెంగువ గ్రామ రైతు సేవ కేంద్రం వద్ద ఎరువుల కోసం వచ్చిన రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో 800 మంది ఉండగా కేవలం 60 బస్తాల మా త్రమే ఎరువులను అధికారులు పంపిణీకి సిద్ధం చేయడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఒక వృద్ధురాలు కింద పడిపోవడంతో తోటివారు లేవనెత్తి కూర్చోబెట్టారు.

యూరియా.. బంగారమాయే..!

యూరియా.. బంగారమాయే..!

యూరియా.. బంగారమాయే..!

యూరియా.. బంగారమాయే..!