
నేడు భీమసింగిలో జాబ్‌మేళా
జామి: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యభివృద్ధి సంస్థ, భీమసింగి బాలాజీ డిగ్రీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో భీమసింగి బాలాజీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్‌మెంట్ అధికారి భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేళాకు 17 బహుళజాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తాయని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించి 18నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఉదయం 9గంటలకు బాలాజీ కళాశాలకు హాజరుకావాలని కోరారు.
తొమ్మిది ఎకరాల జొన్న పంట ధ్వంసం
● లబోదిబో మంటున్న రైతులు
● పట్టించుకోని అటవీశాఖ అధికారులు
కొమరాడ: మండలంలోని గుమడ గ్రామానికి చెందిన చిప్పాడ గౌరునాయుడు, గరుగుబిల్లి శంకరరావులకు చెందిన తొమ్మిది ఎకరాల్లోని జొన్న, పత్తి పంటలను ఇటీవల కోటిపాం పరిసరాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా నాశనం అయితే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదుని ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దిక్కు లేదుంటూ లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు వేలాది ఎకరాల్లో పంటనష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతున్నటికీ ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చి అడవి ఏనుగులను తరలించే ప్రకియ చేపడతామని మాటలు చెబుతోందే కానీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు, రైతులు వాపోతున్నారు.