
బాల్య వివాహాలు నేరం
విజయనగరం లీగల్: బాలబాలికలకు 18 సంవత్సరాల లోపు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బాల్య వివాహాలపై ఆయన బాబా మెట్టలో గల కేంద్రియ విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక కారణాలవల్ల చిన్న వయసులోనే బాలికలకు వివాహాలు చేయడం సరైనది కాదన్నారు. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల అనేక అనేక అనారోగ్య సమస్యలు, శారీరక సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. బాల్య వివాహాల రద్దు చట్టం గురించి బాల బాలికలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా బాల్య వివాహం జరిగినట్లు లేదా చేస్తున్నట్లు తెలియవస్తే వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు లేదా జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. ఇప్పటికీ అనేకచోట్ల బాల్యవివాహాలు ఇంకా నమోదవుతున్నాయన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి గ్రామం, విద్యాసంస్థల్లో బాల్యవివాహాల నిషేధం పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యవంతులను చేయాలన్నారు. అవగాహన సదస్సులో కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోడీ, బెజ్జిపురం యూత్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఝాన్సీలక్ష్మి అధిక సంఖ్యలో బాల, బాలికలు పాల్గొన్నారు.