
లలిత.. నీవే ఆదర్శం
● ఇంటర్ బైపీసీలో సత్తా చాటింది ● ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కై వసం
నెల్లిమర్ల: నిరుపేద కుటుంబంలో పుట్టిన లలిత నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. తమ స్వగ్రామం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యాభ్యాసం కోసం చేరింది. ఇక్కడే ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహంలో ఉంటూ కళాశాలకు ప్రతిరోజూ నడిచి వెళ్లేది. కష్టం అయితేనేం ఇష్టపడి చదివింది. తాను అనుకున్నది సాధించింది. తాజాగా శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. బైపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదీ నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత సాధించిన ఘనత.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బర్ల లలిత తల్లిదండ్రులు సంగమేష్ , సుశీల ఇద్దరూ వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. పదో తరగతిలో 504 మార్కులు సాధించిన లలితను కార్పొరేట్ కళాశాలలో చదివించే స్థోమత వారికి లేదు. అందుకే దూరమైనా సరే వసతిగృహం అందుబాటులో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేర్పించారు. గతేడాది ఫస్ట్ ఇయర్ కూడా లలిత స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇప్పుడు 989/1000 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచింది. లతితను విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిణి జ్యోతిశ్రీ, సహాయ సంక్షేమాధికారిణి రాజులమ్మ, వసతిగృహ సంక్షేమధికారిణి కృష్ణవేణి అభినందించారు.