1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ సామగ్రి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ సామగ్రి సీజ్‌

Apr 12 2025 2:08 AM | Updated on Apr 12 2025 2:08 AM

1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ సామగ్రి సీజ్‌

1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ సామగ్రి సీజ్‌

విజయనగరం: నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం కార్పొరేషన్‌ కమిషనర్‌ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి, తన బృందంతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్లాస్టిక్‌ విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న ప్లాస్టిక్‌ దుకాణాల వద్దకు వెళ్లి నిషేధిత ప్లాస్టిక్‌ అమ్మకాలను గుర్తించి మొత్తం 1,110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని విశాఖ జిల్లా మధురవాడలో ఉన్న జిందాల్‌ వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌కు తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ పల్లి నల్ల నయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో తామ కృషి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాపారస్తులు అనధికారికంగా ప్లాస్టిక్‌ విక్రయాలను సాగిస్తున్నారన్నారు. ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేస్తూ ప్లాస్టిక్‌ను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారన్నారు. ఇక నుంచి నిరంతరం దాడులు నిర్వహించి ప్లాస్టిక్‌ అమ్మకాలను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ప్లాస్టిక్‌ వినిమయం జరగకుండా పూలు, కూరగాయల దుకాణాలు ఇతరత్రా చిన్నచిన్న దుకాణాల వద్దకు వెళ్లి తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అయితే కొంతమంది నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్‌ అమ్మకాలు సాగించడంతో నగరంలో ప్లాస్టిక్‌ వినిమియం జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. దీంతో ఆకస్మిక దాడులు చేపట్టాలని ఆదేశించడంతో 1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకుని, ఎనర్జీ ప్లాంట్‌ కు తరలించామన్నారు. ఇక నుంచి ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్‌ ను విక్రయించినట్లు గుర్తిస్తే సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు, భారీగా అపరాధ రుసుము విధించి, దుకాణాలను సీజ్‌ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, అంజిబాబు, రవిశేఖర్‌, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement