వాడుకొని... వదిలేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

వాడుకొని... వదిలేస్తున్నారు!

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

ఏయూ ప్రాంగణంపై

అజమాయిషీ ఎవరిది?

ఎన్నికల కార్యకలాపాలతో భవనాలు,

తరగతి గదులు ధ్వంసం

మరమ్మతుల గురించి పట్టించుకోని

జిల్లా యంత్రాంగం

వీసీ తీరుపై విద్యార్థి సంఘాలు,

పూర్వ విద్యార్థుల ఆక్షేపణ

విశాఖ విద్య: విద్య, పరిశోధన, క్రీడా ప్రయోజనాల కోసం కేటాయించాల్సిన ఏయూ ప్రాంగణం, మైదానాలు, భవనాలను జిల్లా యంత్రాంగం ఇష్టానుసారంగా వినియోగిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కార్యక్రమాల నిర్వహణ అనంతరం దెబ్బతిన్న భవనాలు, మైదానాలను బాగుచేయకుండా వదిలేస్తున్నారు. దీంతో ఆ మరమ్మతుల ఆర్థిక భారం వర్సిటీపైనే పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎన్నికల విధులతో

మౌలిక వసతులకు తీవ్ర నష్టం

ఎన్నికల అవసరాల పేరిట జిల్లా యంత్రాంగం క్యాంపస్‌లోని పలు భవనాలను స్వాధీనం చేసుకుంది. ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు వివిధ విభాగాల తరగతి గదులు, సెమినార్‌ హాళ్లు, ఫర్నిచర్‌ను విస్తృతంగా వినియోగించినా, తిరిగి అప్పగించే సమయంలో వాటి పరిస్థితిని పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికల కోసం పరిమిత భవనాలనే తీసుకునేవారని, ప్రక్రియ ముగిశాక జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ నిధులతోనే మరమ్మతులు చేయించేవారని గుర్తుచేస్తున్నారు. ఈసారి వర్సిటీ ప్రాంగణాన్ని దాదాపు పూర్తిగా జిల్లా యంత్రాంగం ఆధీనంలోకి వెళ్లేలా వ్యవహరించారని, దీంతో తరగతి గదులు, సెమినార్‌ హాళ్లు వినియోగించుకోలేని స్థితికి చేరాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

వందేళ్ల సాంప్రదాయానికి తాళాలు

దాదాపు వందేళ్లుగా నాగుల చవితి సందర్భంగా ప్రజలు ఏయూ ప్రాంగణాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఆ సంప్రదాయానికి అడ్డుకట్ట వేస్తూ గేట్లు మూసివేసి ప్రవేశం నిరాకరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఘటన గత వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగి ఉంటే మతపరమైన రంగు పులిమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారని, ఇప్పుడు మాత్రం మౌనం వహించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వర్సిటీ ఆస్తుల పరిరక్షణలో వీసీ మౌనం?

విశ్వవిద్యాలయం అనేది జిల్లా యంత్రాంగం అవసరాల కోసం వాడుకునే ప్రభుత్వ ప్రాంగణం కాదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాకేంద్రమని విద్యార్థి వర్గాలు గుర్తుచేస్తున్నాయి. మైదానాలు క్రీడాకారుల కోసం, తరగతి గదులు విద్యార్థుల కోసం ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైస్‌ ఛాన్సలర్‌(వీసీ) వైఖరిపై క్యాంపస్‌లో చర్చ జరుగుతోంది. వర్సిటీ ఆస్తులు, వసతులను కాపాడాల్సిన బాధ్యత వీసీదే కదా అని, యంత్రాంగం వల్ల నష్టం వాటిల్లితే ఎవరు ప్రశ్నించాలని విద్యార్థులు నిలదీస్తున్నారు.

మెట్లపై ఇష్టారీతిన పడేసిన

విద్యార్థుల బెంచీలు

ఈవెంట్ల పేరుతో

మైదానాల విధ్వంసం

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో అభివృద్ధి చేసిన క్రీడా మైదానాలు.. సమ్మిట్‌లు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో కళ తప్పాయని క్రీడా వర్గాలు విమర్శిస్తున్నాయి. తాత్కాలిక నిర్మాణాలు, సిమెంట్‌ పునాదుల ఏర్పాటుతో మైదానాలు దెబ్బతిని, క్రీడలకు పనికిరాని పరిస్థితి. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రత్యామ్నాయ వేదికలు లేవా? ప్రతిసారీ యూనివర్సిటీ మైదానాలనే ఎందుకు ఎంచుకుంటున్నారని.. విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్యాంపస్‌లోని హెలిప్యాడ్‌ గ్రౌండ్‌, ఇంజినీరింగ్‌ కళాశాల మైదానాలను అభివృద్ధి చేసి, చిన్న జీయర్‌ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన నామకరణం చేసిన ‘ఏయూ ఊర్జా–ఎనర్జీ గ్రౌండ్‌’సహా పలు మైదానాలు నేడు క్రీడల కంటే ప్రభుత్వ, వాణిజ్య కార్యక్రమాలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.

యథాతథంగా అప్పగించాలి

యూనివర్సిటీ మైదానాలను క్రీడాకారులకు, విద్యార్థులకు అనువుగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. సమ్మిట్‌లు, ఇతర కార్యక్రమాలతో దెబ్బతిన్న మైదానాలను తక్షణమే పునరుద్ధరించాలి. ఎన్నికల నిర్వహణ సమయంలో దెబ్బతిన్న తరగతి గదులు, సెమినార్‌ హాళ్లు, ఫర్నిచర్‌, మరుగుదొడ్లను జిల్లా యంత్రాంగమే బాగుచేయించాలి. సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి చేసిన మైదానాలకు జరిగిన నష్టంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలి. – డా.మీనన్‌,

కన్వీనర్‌, ఏయూ పరిక్షణ సమితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement