బీచ్‌రోడ్డు: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు తప్పదని సీఐటీయూ నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా డిసెంబరు 1 నుంచి నిరవధికంగా ఢిల్లీని ఆక్రమిద్దాం అనే నినాదంతో సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. చలో ఢిల్లీకి కార్మికవర్గం తరలి రావాలని కోరుతూ సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ మంగళవారం సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేపట్టింది. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు 1 నుంచి నిరవధికంగా ఢిల్లీని ఆక్రమిద్దాం మని సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపును జయప్రదం చేయాలని, విశాఖ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఢిల్లీకి తరలిరావాలని కోరారు. దేశంలో సంపదను సృష్టిస్తున్న కార్మికుల చట్టాలను తొలగించి, 4 లేబర్ కోడ్స్‌గా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని, యజమానులకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. ఎకరం భూమి 99 పైసలకే పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న ప్రభుత్వం కార్మికులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించే ఈఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణానికి భూమి కేటాయించకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యమైందనే విషయాన్ని గుర్తుచేశారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ప్రజలు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో జిల్లా అధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, సుబ్బారావు, వెంకట్రావు, వెంకటలక్ష్మి, లక్ష్మణమూర్తి, కోశాధికారి జ్యోతేశ్వరావు, కార్యదర్సులు పి.మణి, బి.జగన్, నమ్మి రమణ, ఒ.అప్పారావు, అనసూయ, మేరీ, చంద్రశేఖర్, నూకరాజుతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.


