ఏసీబీ వలలో ఆర్‌ఐ నాగేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఆర్‌ఐ నాగేశ్వరరావు

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

● రైతు నుంచి భూమి మ్యుటేషన్‌కు రూ.50వేల లంచం డిమాండ్‌ ● ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు అల్లుడు శివ

కె.కోటపాడు: కె.కోటపాడు తహసీల్ధార్‌ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎ.నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వారాడ గ్రామానికి చెందిన వృద్ద రైతు ఇటీవల రీసర్వేలో తన పేరున గల 1 ఎకరా ముప్ఫైమూడున్నర సెంట్లు భూమి వేరే రైతు పేరున పడడంతో మార్పు చేయాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు వారాడ గ్రామంలో వృద్ధ రైతు సాగులో ఉన్న భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాడు. వృద్ధ రైతు సాగులోనే భూమి ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ భూమి మ్యుటేషన్‌కు రూ.50వేలను ఇస్తే వీఆర్వో, డీటీ, తహసీల్దార్‌కు ఇచ్చి తన పని చేయించనున్నట్టు వృద్ధ రైతుకు ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. దీంతో ఆ రైతు జరిగిన విషయాన్ని తన అల్లుడు శివకు వివరించారు. దీంతో ఈ నెల 14న విశాఖపట్నంలో గల ఏసీబీ అధికారులను ఆ రైతు అల్లుడు శివ కలిసి ఎంఆర్‌ఐపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోనికి దిగిన ఏసీబీ అధికారులు ఫిర్యాదును పరిశీలించి నిజమేనని నిర్ధారణకు వచ్చినట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి విలేకరులకు తెలిపారు. బాధిత రైతు అల్లుడు శివకు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని ఎంఆర్‌ఐ నాగేశ్వరరావు కోరడంతో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోనే శివ నుంచి నాగేశ్వరరావు రూ.50వేలను తీసుకున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న నాగేశ్వరరావును రెడ్‌ హేండడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ ఎంఆర్‌ఐ నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అవినీతికి పాల్పడే అధికారులపై ఫిర్యాదులు ఉంటే ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు సుప్రియ, పృధ్వీతేజ, శ్రీనివాసరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement