మధురవాడ: ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన సచివాలయ సిబ్బంది.. రాజకీయ పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు.. అధికార పార్టీ నేతలతో కలిసి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్లిప్పుల పంపిణీ జరగాల్సి ఉండగా.. జీవీఎంసీ 8వ వార్డులో సోమవారం చోటుచేసుకున్న ఘటన దుమారం రేపుతోంది. సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి స్లిప్పులు పంపిణీ చేశారనే ఆరోపణలు.. ఒకే మహిళకు కుటుంబ సభ్యుల పేర్లతో పదుల సంఖ్యలో స్లిప్పులు ఇవ్వడం.. ఈ వ్యవహారంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఒకే మహిళకు పదుల సంఖ్యలో స్లిప్పులు
మధురవాడ కరెంటు ఆఫీసు సమీపంలోని దోభీ కాలనీలో సోమవారం మధ్యాహ్నం సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఒకే మహిళకు కుటుంబ సభ్యుల పేర్లతో పదుల సంఖ్యలో స్లిప్పులు ఇవ్వడాన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ అభిమానులు అక్కడికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో కూటమి కార్యకర్తలు ప్రశ్నించిన వారిని వీడియోలు తీస్తూ.. ‘సంగతి చూస్తాం’ అంటూ హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరింది.
విధుల నిర్వహణలో రాజకీయ జోక్యమా?
తాము ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఒకే మహిళకు పెద్ద సంఖ్యలో స్లిప్పులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందించలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తామే వీడియోలు తీశామని కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. వీడియోలు తీయడంలో తప్పులేదని పోలీసులు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
సిబ్బందిపై తీరుపై విమర్శలు
ప్రభుత్వ సిబ్బంది రాజకీయ పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఘటనలో సిబ్బంది వ్యవహరించిన తీరుపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో నిబంధనలు పాటించారా? సిబ్బంది వెంట రాజకీయ నాయకులు ఉండటానికి కారణమేంటి? ఒకే మహిళకు అంత పెద్ద సంఖ్యలో స్లిప్పులు ఎందుకు ఇచ్చారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఒకే మహిళ వద్ద పదుల సంఖ్యలో ఉన్న ఓటరు స్లిప్పులు
ఘటనా స్థలంలో
విచారణ చేస్తున్న ఎస్‌ఐ


