అధికారం అండతో.. కూటమి నాయకుల బరి తెగింపు ఎన్నికల కోడ్ ఉన్నా అక్రమంగా కుళాయి కనెక్షన్లు అధికారులు ససేమిరా అన్నా.. వెనక్కి తగ్గని వైనం
సాక్షి, విశాఖపట్నం : అధికారం ఉందనే అహం.. అడిగేవారు లేరనే ధైర్యం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఓట్ల కోసం నీచ రాజకీయం.. కూటమి నాయకుల తీరు చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. వారి దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదనే నిబంధన ఉన్నా.. కూటమి నాయకులకు అవేమీ పట్టడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించే వారికే తమ మద్దతు ఉంటుందని స్థానికులు ముక్తకంఠంతో కోరడంతో.. అక్కడే ఉంటున్న ఓ బీజేపీ నాయకుడు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే వారికి అక్రమంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చేశారు. దీనిపై స్థానిక నాయకులు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో అధికారులు వచ్చి అక్రమంగా వేసిన కుళాయి కనెక్షన్లను తొలగించారు. అయితే అధికారులు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ యథావిధిగా కుళాయి కనెక్షన్లు ఇచ్చేశారు.
ఇదీ సంగతి..
అది ఏ మారుమూల ప్రాంతమో కాదు.. ఏజెన్సీ ప్రాంతమూ కాదు.. ఘనత వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోనే ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక వాడ అయిన గాజువాక నియోజకవర్గంలోని అక్కిరెడ్డిపాలెం ప్రాంతం అది. పాత వార్డు 68 కాగా, కొత్త వార్డు 85. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో సుమారు 200 కుటుంబాలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నాయి. అయితే, ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వీరి పరిస్థితిని పలుమార్లు జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
గుడివాడ కుటుంబం చొరవతో..
ఈ ప్రాంత ప్రజల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన మాజీ మంత్రి, అప్పటి కార్పొరేటర్ 2007లో 40 కుళాయిలు మంజూరు చేశారు. ఆ తర్వాత 2021లో అప్పటి కార్పొరేటర్ గుడివాడ అనూష మరో 20 కుళాయిలు మంజూరు చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. అయితే, అక్కడ రైల్వే ట్రాక్ ఉండటంతో అక్రమంగా కుళాయిలు వేశారంటూ జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు వాటిని తొలగించారు.
ఎన్నికల వేళ.. మళ్లీ నీటి సమస్య తెరపైకి..
గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల వేళ అక్కడి ప్రజల తాగునీటి సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఓట్ల కోసం వెళ్లిన అభ్యర్థులతో.. ‘మాకు నోటు వద్దు.. గుక్కెడు నీళ్లు ఇచ్చిన వారికే మద్దతిస్తాం’ అని స్థానికులు స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. ఇదే అదునుగా భావించిన బీజేపీ నాయకుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఆ వార్డులో పోటీ చేస్తున్న తన బంధువుకు ఓట్లు వేస్తే రాత్రికి రాత్రే కుళాయిలు వేయిస్తామని హామీ ఇచ్చారు. అన్నదే తడవుగా జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఏఈని సంప్రదించగా.. ఈ సమస్య కోర్టులో ఉందని, అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కనెక్షన్లు ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. దీంతో జీవీఎంసీ కమిషనర్‌తో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే అవకాశం లేదని జీవీఎంసీ కమిషనర్ కూడా చెప్పినా.. ఆ అధికారుల మాటలను పెడచెవిన పెట్టారు. అధికారం ఉందనే అహంభావంతో వాల్వ్‌లను తిప్పేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అడ్డుకున్నా.. ఆ తర్వాత మళ్లీ షరామామూలుగానే అక్రమ కనెక్షన్లను కొనసాగించడం కొసమెరుపు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుంది.. ఎన్నికల అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!


