ఏయూ అతి జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

ఏయూ అతి జాగ్రత్త!

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

తుపాను భయంతో పది రోజుల సెలవులు ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజులే విరామం హాస్టళ్ల లీకేజీలు బయటపడతాయనే భయమా?

విశాఖ విద్య: తుపాను ముప్పుపై ఆంధ్ర విశ్వవిద్యాలయ(ఏయూ) యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. సోమవారం నుంచే ఏకంగా పది రోజులపాటు తరగతులకు సెలవు ప్రకటించేసింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 27, 28 తేదీల్లో మాత్రమే సెలవులివ్వగా.. ఏయూ మాత్రం నవంబర్‌ 4 వరకు ప్రత్యక్ష తరగతులుండబోవని, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించడంపై వర్సిటీ వర్గాల్లో విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా తుపాను వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పరిస్థితుల అంచనా మేరకు ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం విద్యాసంస్థలకు ఒకటి, రెండు రోజులపాటు సెలవులు ప్రకటిస్తుంటాయి. ఏయూ యంత్రాంగం మరింత అతిగా వ్యవహరించడం వెనుక ఏ ‘విపత్తు’ను దాచి పెట్టేందుకోనన్న సందేహాలు ముసురుకుంటున్నాయి.

ప్రేమా.. భయమా?

విద్యార్థుల భద్రతపై శ్రద్ధతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక హాస్టళ్లలోని సమస్యలు బయటపడతాయనే ఆందోళనతో సెలవులు ప్రకటించారా? అన్న చర్చ విద్యార్థి వర్గాల్లో జరుగుతోంది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఇన్ని రోజులపాటు సెలవులు ప్రకటించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్సిటీలోని పలు హాస్టల్‌ భవనాలు వర్షాలకు కారుతున్నాయని, కొన్ని చోట్ల ఇప్పటికీ మరమ్మతులు పూర్తికాలేదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హాస్టళ్లలోని సమస్యలు మరింత తీవ్రమైతే విద్యార్థులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని, ఎన్నికల సమయంలో అది ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ముందస్తుగా సెలవులు ప్రకటించారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజులే..

సోమవారం జిల్లాతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు యథావిధిగా కొనసాగాయి. తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజులే సెలవులు ప్రకటించారు. ఏయూతోపాటు, ఏయూ పరిధిలోని అనుబంధ కళాశాలలకు కూడా పది రోజులు సెలవులు ప్రకటించడం విద్యార్థులు, వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా పది రోజులపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే విద్యార్థులకు ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందన్నది మరో ప్రశ్న. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎదుర్కొనే ఇంటర్నెట్‌ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త ముసుగులో ఏయూ అతి జాగ్రత్త చర్యలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement