గ్రేటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల నినాదం ఇదే సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న అభ్యర్థులు ఐదేళ్లలో రూ.5,794.99 కోట్ల సంక్షేమం.. 25.86 లక్షల మందికి లబ్ధి భూముల కేటాయింపులు, టెండర్లలో వాటాలే టీడీపీ అభివృద్ధి బీసీ మహిళ నుంచి మేయర్ పీఠం లాక్కోవడమే కూటమి కుతంత్రం
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ ఎన్నికల సంగ్రామం జోరందుకుంది. కుట్రలు, కుతంత్రాలనే ఆయుధాలుగా చేసుకుని.. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తుంటే.. మాటల యుద్ధాలు లేకుండా కేవలం తమ హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన అంకెలనే అస్త్రంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటి? కూటమి దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటనేది స్పష్టం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో..
అభివృద్ధి అంటే భవనాలు, రహదారులు నిర్మించడమే కాదు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం కూడా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసిందనడానికి గణాంకాలే నిదర్శనం. ఐదేళ్లలో 25,86,924 మందికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.5,794 కోట్ల 99 లక్షల 37 వేల 897 ఆర్థిక సాయం అందించింది.
రెండున్నరేళ్లలో సంక్షేమానికి తూట్లు..
విశాఖ విధ్వంసం
కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో విశాఖ ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేయడంతో పాటు విశాఖను విధ్వంసం చేశారు.
● సూపర్ సిక్స్‌లో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి.. 8 లక్షల మంది మహిళలకు రూ.3 వేల కోట్ల సాయం అందించకుండా మోసం చేశారు.
● ఉచిత గ్యాస్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా.. రెండున్నరేళ్లలో 5.6 లక్షల సిలిండర్లు ఇవ్వలేదు.
● తల్లికి వందనం పథకం కింద జిల్లాలో 3,26,494 మందికి రూ.15 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. 1,90,907 మందికే ఇచ్చి.. 1,35,587 మంది విద్యార్థులకు అందకుండా చేశారు.
● నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి.. జిల్లాలో 2.05 లక్షల మంది నిరుద్యోగులకు సుమారు రూ.1,500 కోట్లు ఇవ్వలేదు.
● జిల్లాలో గతంలో 1,65,891 మంది పింఛనుదారులు ఉండగా.. ప్రస్తుతం 1,56,610 మందికే పింఛన్లు ఇస్తూ.. 9,281 మందికి నిలిపివేశారు.
● ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీని నెరవేర్చకుండా.. సుమారు 60 వేల మంది విద్యార్థులకు రెండున్నరేళ్లలో రూ.250 కోట్లు చెల్లించలేదు.
● విశాఖ అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఎకరానికి 99 పైసలకే కేటాయిస్తూ.. రూ.5 వేల కోట్ల విలువైన సుమారు 50 ఎకరాల భూములను ధారాదత్తం చేశారు. దీంతో 27 లక్షల మంది ప్రజలకు అన్యాయం చేశారు.
● జీవీఎంసీ ఖజానాకు చేరాల్సిన సుమారు రూ.1,700 కోట్లను నగరాభివృద్ధికి ఖర్చు చేయకుండా దారిమళ్లించారు.
● స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని చెప్పి.. చివరకు ప్లాంట్ ఆస్తుల వేలానికి అనుమతిస్తూ, కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు.
● కూటమి కక్షపూరిత రాజకీయాల కారణంగా పీఎం ఆవాస్ యోజన, పీఎం పోషణ్ తదితర పథకాలకు సంబంధించిన సుమారు రూ.150 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
● విశాఖ అభివృద్ధి నిధుల్లో రూ.200 కోట్లకు పైగా సదస్సుల నిర్వహణకు ఖర్చు చేసి ప్రచారార్భాటానికి ప్రాధాన్యమిచ్చారు.
● విశాఖ తీరంలో పర్యావరణ పరిరక్షణ నిబంధనలను సడలించి.. తమకు నచ్చినవారు అడ్డగోలు నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా సీఆర్‌జెడ్–3 నుంచి సీఆర్‌జెడ్–2కు మార్చారు.
● విశాఖలోని మారిటైమ్ బోర్డు, జీఎస్‌టీ, సీబీఐ, ఆర్‌బీఐ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ, అమరావతికి తరలించారు.
ఇలా రెండున్నరేళ్లలో ఏ వ్యవస్థను చూసినా చెప్పుకోడానికి ఏముంది గర్వకారణం.. కూటమి హయాంలో కక్ష రాజకీయాలకే ప్రాధాన్యమిస్తూ.. అభివృద్ధిని విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మేయర్ పీఠంపై కూర్చోబెడితే.. ఇక విశాఖ నగరం విశ్వనగర ఖ్యాతి నుంచి తిరోగమన దిశగా పయనించే ప్రమాదం ఉందని విశ్లేషకులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
కూటమి హామీలు ఘనం.. అమలు శూన్యం!
2024 ఎన్నికల సమయంలో ఈ లెక్కలన్నీ చూసి.. ఇదంతా ప్రజల సొమ్మే కదా? తిరిగి ప్రజలకే పంచారుగా? ఎవరైనా ఇలానే చేస్తారు.. మేం అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ చంద్రబాబు మొదలుకొని చోటా నేతల వరకు మైకులు హోరెత్తేలా, ప్రజల చెవులు చిల్లులు పడేలా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక.. సూపర్ సిక్స్ హామీలను కూడా ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేకపోయారు. తీసుకొస్తున్న లక్షల కోట్ల అప్పుల సొమ్ములు ఏమవుతున్నాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇచ్చింది ప్రజల సొమ్మే.. మీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవని అంటే.. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా అంటూ ప్రజల మీదే తిరగబడుతున్న రోజులొచ్చేశాయి.
పథకం లబ్ధిదారులు బదిలీ చేసిన నగదు
వైఎస్సార్ ఆసరా 2,85,061 638,15,98,523
అమ్మ ఒడి 4,25,001 963,67,40,556
అర్చకులకు కరోనా భృతి 521 26,05,000
జగనన్న చేదోడు 19,602 53,62,80,000
కోవిడ్ సాయం 4,41,096 44,10,96,000
పంట బీమా 8,471 19,52,54,250
ఈబీసీ నేస్తం 9,134 22,95,30,000
హౌసింగ్(డీబీటీ) 47,881 3,07,18,23,773
ఇమామ్స్ 20 1,00,000
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ 7,769 5,73,71,520
జగనన్న తోడు(వడ్డీ) 28,278 1,23,77,674
జగనన్న తోడు(రుణాలు) 56,537 82,80,80,000
జగనన్న వసతి దీవెన 1,26,845 137,13,66,671
జగనన్న విద్యా దీవెన 1,35,050 372,17,29,003
వైఎస్సార్ కల్యాణమస్తు 924 5,49,20,000
వైఎస్సార్ కాపునేస్తం 10,092 40,49,55,000
వైఎస్సార్ లా నేస్తం 109 65,40,000
వైఎస్సార్ మత్స్యకార భరోసా 17,585 45,56,50,000
వైఎస్సార్ నేతన్న నేస్తం 52 26,16,000
పాస్టర్లకు భృతి 810 40,50,000
వైఎస్సార్ రైతు భరోసా 1,03,933 468,36,84,950
సున్నా వడ్డీ పంట రుణాలు 15,171 3,72,73,463
సున్నా వడ్డీ 3,80,916 114,13,44,822
వైఎస్సార్ వాహన మిత్ర 30,398 102,69,20,000
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 47,843 35,10,83,275
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ 78,593 312,82,62,940
వైఎస్సార్ బీమా 3,479 51,09,30,000
వైఎస్సార్ చేయూత 1,05,526 452,63,81,250
వైఎస్సార్ పెన్షన్ కానుక 2,00,227 1820,11,97,000
మొత్తం 25,86,924 5794,99,37,897


