జనసేన వార్డుల అభ్యర్థుల ఎంపికలో అనుమానాలు
114వ వార్డు అభ్యర్థిని ఆఖరి నిమిషంలో ఎందుకు మార్చోరో చెప్పాలి
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి
పెద్ద పీట వేయడం దారుణం
జనసేన ఎన్నికల పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీకాంత్
పెందుర్తి: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు నియోజకవర్గంలో ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని, జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆ పార్టీ స్థానిక సంస్థల నియోజకవర్గ సమన్వయకర్త, 113వ వార్డు అధ్యక్షుడు ఒబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆరోపించారు. 114వ వార్డు అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చడంపై పార్టీ అధిష్టానం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వేపగుంటలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా ఉన్న తనకు కనీసం పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానం అందడం లేదన్నారు. నియోజకవర్గంలోని తొమ్మిది వార్డుల్లో నాలుగింటిని జనసేనకు కేటాయించగా.. అభ్యర్థుల పేర్లను సైతం సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 113, 115, 104 వార్డుల్లో ఎమ్మెల్యేతో ఉన్న సంబంధాలు, ఆర్థికంగా సహకరించిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. జనసేన నిబంధనలు, భావజాలానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరగలేదన్నారు. 114వ వార్డులో కంచిపాటి మధుకు నామినేషన్ల ఉపసంహరణ రోజున మధ్యాహ్నం 1.40 గంటలకు బీ–ఫారం ఇచ్చారని, ఆ తర్వాత డబ్బు లేదనే కారణంతో మధ్యాహ్నం 2.50 గంటలకు కోన మోహన్‌కుమార్ నాయుడుకు కేటాయించి మరో బీ–ఫారం ఇచ్చారని శ్రీకాంత్ ఆరోపించారు. గడువు ముగియడానికి ఐదు నిమిషాల ముందు మధుతో బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేయడం వెనుక ఉన్న కారణాలను ఎమ్మెల్యే పంచకర్ల వివరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


