తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో గురువారం ‘రైల్ జన్ సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోన్ పరిధిలోని 350 రైల్వే స్టేషన్లలో 220 మంది అధికారులు, 800 మంది సూపర్‌వైజర్లు పాల్గొని ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడారు. జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ సూచనలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా విశాఖ రైల్వే స్టేషన్, వెయిటింగ్ హాళ్లలోని ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని కలిసి రైల్వే సేవలు, ప్రయాణికుల సౌకర్యాలపై వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. స్టేషన్లలో అందుతున్న సేవలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల నుంచి అందిన సూచనలు, అభిప్రాయాలను స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంశాలుగా విభజించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే, జీఎం సందీప్ మాధుర్ విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో పక్వాడాలో భాగంగా నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్, సీనియర్ డీఎంఈ ఆనంద్‌కుమార్, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ డి.జగదీశ్వరరావు, డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ గౌరవ్ పాల్గొన్నారు.


