భీమునిపట్నం: భీమిలిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తొమ్మిదో తరగతి విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విద్యాలయాన్ని సందర్శించిన ఆయన ప్రిన్సిపాల్ గంగాకుమారితో పాటు విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఘటన దురదృష్టకరమన్నారు. విద్యార్థినులను విచారించినప్పటికీ తమకు తెలియదని, ఘటనపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. బయటి వ్యక్తులు వచ్చి ఈ ఘటనకు పాల్పడే అవకాశం లేదని, విద్యాలయంలోని వారిలోనే ఎవరో ఒకరు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.


